SCAM IN NREGA : వలసలు నిరోధించి గ్రామాల్లోనే పేద వర్గాలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంతమంది అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. రోజంతా ఎండలో చెమటోడ్చి పనిచేసే నిరుపేదల కష్టాన్ని తప్పుడు మస్టర్లతో స్వాహా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు పంచాయతీ కాశీపురంలో గత మూడేళ్లుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. పనికి వెళ్లకున్నా, గ్రామం విడిచి వెళ్లి దూర ప్రాంతాల్లో స్థిరపడ్డవారి పేర్లూ మస్టర్లలో నమోదవుతున్నాయని వేతన దారులు ఆరోపిస్తున్నారు. వారందరి పేర్లూ నమోదు కావడం వల్ల తమ వేతనానికి ఎసరు తగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు కట్టి..పని పట్టి : పనికి రాని వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మిగతా మొత్తాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. అటు ఉపాధి పని కల్పించాలంటే తమ వద్ద నుంచి వారానికి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడని అలా ఇచ్చిన వారికే మస్టర్లు నమోదువుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్నవ్యక్తి గతంలోనూ రెండు సార్లు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడని మళ్లీ అతడికే అధికారులు అవకాశం కల్పించడంతో పేట్రేగిపోతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాడని వాపోతున్నారు.
50 రూపాయలు..అవ్వా తాతలకు ఉపాధి హామీ : లమ్మత కృష్ణారావు మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తూ పడిపోగా తీవ్రంగా గాయపడి మంచం నుంచి లేవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈయన పేరును కూడా మస్టర్‌లో చేర్చి మూడేళ్లుగా ఉపాధి పనికి వెళ్తున్నట్లు చూపుతున్నారు. ఆయన పేరు మీద వస్తున్న మొత్తంలో కొంత అతడికి ఇచ్చి మిగిలిన డబ్బును స్వాహా చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా మంచం పట్టిన అట్టాడ అప్పమ్మది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఈమె కూడా పనికి వస్తున్నట్లు చూపుతున్నారు. డబ్బు చెల్లింపుల సమయంలో ఆమె వద్దకు వచ్చి వేలి ముద్రలు తీసుకుని 50 రూపాయలు మాత్రం ఆమెకు ఇచ్చి మిగతాది జేబుల్లో వేసుకుంటున్నారు.