Kanugula valasa village : ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఓ ఉద్యోగి, అందునా అత్యధికంగా డాక్టర్లు ఉన్నారు. జనాభాపరంగా చిన్న గ్రామమైనా... వ్యవసాయం చేసుకునే గ్రామస్తులు విద్యకు ప్రాధాన్యమిచ్చారు. తమ పిల్లలను బాగా చదివించారు. తొలి తరం వ్యవసాయంలో చెమటోడ్చగా.. రెండో తరం చదువులో రాణించి ఉద్యోగాలు దక్కించుకుంది. ఆ తర్వాత తరం వైద్యవృత్తిని ఎంచుకుంది. తల్లిదండ్రుల ఆశయంతో పాటు వైద్య విద్యపై పిల్లల ఆసక్తి.. ఫలితంగా డాక్టర్ల గ్రామంగా మారిపోయింది.
నాడు వ్యవసాయమే జీవనాధారం.. ఆ గ్రామంలో ప్రస్తుతం 2,800 వందల మంది జనాభా ఉంటే 900 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు, ప్రతి కుటుంబంలోనూ ఒక డాక్టరు, ఇంజినీరు, పోలీసు, రైల్వే ఉద్యోగిగా కచ్చితంగా ఉంటారు, అలా.. గ్రామంలో 150 మందికి పైగా ప్రముఖ వైద్యులు ఉన్నారు. ఢిల్లీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ హాస్పిటల్ లో ఇక్కడ వైద్యులు కచ్చితంగా ఉంటారు. ఈ గ్రామ పొలిమేరలో ఒక డాక్టర్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది, వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ప్రజలు తమ పిల్లలను డాక్టర్లు చేయాలని కలగన్నారు. ఆ కలలను నెరవేర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామస్తులు తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నారు.
పూర్వం మా ఊళ్లో ఎక్కవ మంది వ్యవసాయం చేసేవారు. తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి వారి పిల్లలు చాలా కష్టపడి చదివారు. ఆ తర్వాత ఎక్కుమ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వారి పిల్లలు కూడా ఎంతో క్రమ శిక్షణతో చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎయిమ్స్ మొదలుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కూడా మా గ్రామానికి చెందిన డాక్టర్లే ఉన్నారు. - నూకరాజు, సర్పంచ్ కనుగులవలస
మా ఉళ్లో పిల్లలు ఎంతో క్రమశిక్షణతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రైల్వే, పోలీస్, ఆర్మీ తో పాటు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 120 మందికి పైగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఉన్నారు. - బొడ్డేపల్లి నారాయణ రావు, రిటైర్డ్ ఉద్యోగి