శ్రీకాకుళం జిల్లా పాలకొండ - విశాఖపట్నం రహదారి పేరు చెబితే జనం భయాందోళనకు లోనవుతున్నారు. రాజాం మీదుగా పాలకొండ వరకు ఈ రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారింది. గుంతల కారణంగా వాహనాలూ దెబ్బతింటున్నాయి. రాజాం - పాలకొండ మధ్య ఉన్న 21 కిలోమీటర్ల ప్రయాణానికి రెట్టింపు సమయం పడుతోంది. ఫలితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేరకోలేకపోతున్నామని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు.
రద్దీ పెరిగినా నోచుకోని విస్తరణ...
ఈ రహదారిపై రద్దీ పెరుగుతోందని రోడ్లు భవనాల శాఖ గుర్తించినా అందుకు తగ్గట్లు విస్తరణ పనులు జరగడం లేదు. గతేడాది నుంచి నేటివరకు 14 రోడ్డు ప్రమాదాలు జరగగా.. నలుగురు మృత్యవాతపడ్డారు. 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతుకులు, దుమ్ము, ధూళితో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.