ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాటికాపరుల నిజాయతీని అభినందించిన స్థానికులు - శ్రీకాకుళం జిల్లా తాజావార్తలు

మనం ఎక్కడైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో పక్కవాడి నుంచి ఎప్పుడు ఎలా దోచుకోవాలని ఆలోచించే వారే తప్ప.. పోయిన వస్తువులు దొరికితే తిరిగి తెచ్చిచ్చే వారు కనుమరుగయ్యారు. అలాంటిది అంత్యక్రియలు నిర్వహించి శ్మశానంలో వదిలివెళ్లిన బంగారు ఆభరణాలను.. కాటికాపరులు చూసి సంబంధిత వ్యక్తులకు అందించారు. వారు చూపిన నిజాయతీని స్థానికులు అభినందిస్తున్నారు.

humanity
బంగారం అప్పగిస్తున్న కాటికాపరులు

By

Published : May 29, 2021, 9:00 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని భవానిపురం వీధికి చెందిన గానుగుల జయలక్ష్మి(70) అనే వృద్ధురాలు మరణించింది. సమీపంలోని సంతతోట శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో మృతురాలి ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను తీసి… కుటుంబ సభ్యులు ఓ వస్త్రంలో కట్టి భద్రపరిచారు. దహన సంస్కారాలు ముగిశాక వాటిని అక్కడే మరచిపోయి వెళ్లారు. అనంతరం.. మరో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన కాటికాపరులు జయలక్ష్మి కుటుంబ సభ్యులు వదిలి వెళ్లిన నగలు గమనించారు. వెంటనే వారిని సంప్రదించి.. బంగారు ఆభరణాలను అందజేశారు. జమ్ము గ్రామానికి చెందిన కోటిపల్లి రాము, బొంతల వీధికి చెందిన కంబకాయ ఎల్లయ్య రజక వృత్తి చేస్తూ కాటికాపర్లుగా ఉన్నారు. వారిద్దరూ చూపిన నిజాయతీకి స్థానికులు, జయలక్ష్మి కుటుంబ సభ్యులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details