శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఓ వ్యక్తి మృతి చెందటం ఉద్రిక్తతలకు దారి తీసింది. వీరఘట్టంలో దిగువ వీధికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. వివాదం సర్ది చెప్పేందుకు అదే వీధికి చెందిన పోలిరాజు అనే వ్యక్తి ప్రయత్నించాడు. తోపులాటలో అతను కిందపడి అస్వస్థతకు గురయ్యాడు. పోలిరాజును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు.
గొడవ ఆపేందుకు వెళ్లి వ్యక్తి మృతి... పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత - వీరఘట్టం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వార్తలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో అన్నదమ్ముల ఘర్షణ ఆపేందుకు వెళ్లిన పోలిరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు వీరఘట్టం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలిరాజు మృతికి వేణుగోపాల్ రావు అనే వ్యక్తి కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో వీరఘట్టం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు వేణుగోపాల్ రావు వర్గం కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకొండ ఎస్సై ఆదం ఆధ్వర్యంలో ఇరువర్గాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలకొండ- వీరఘట్టం ప్రధాన మార్గంలో మృతుని బంధువులు బైఠాయించటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.