ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విగ్రహం పంచాయితీ.. పలాసలో ఉద్రికత్త వాతావరణం - tdp fires on sidhiri appalraju

స్వాతంత్య్ర సమర యోధుడు గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పలాసలో 144 సెక్షన్‌ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహం వద్ద భారీ బందోబస్తు పెట్టారు. పోలీసుల వైఖరిపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

high tension at palasa
స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్నపై

By

Published : Dec 24, 2020, 9:09 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. తెదేపా నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో పాటు మరికొందరు పార్టీ నాయకులు డీఎస్పీ శివరామిరెడ్డితో ఈ విషయంపై చర్చించారు. విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు తమకు అనుమతివ్వాలని కోరారు. పోలీసులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సోంపేటలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, పలాసలో గౌతు శిరీషను పోలీసులు నిర్బంధించారు. దీనిపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడు ఆగ్రహం

నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుని పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా పోలీసులు వ్యవహరించారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామన్న మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణలు చెప్పేవరకు విడిచి పెట్టమని హెచ్చరించారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని అచ్చెన్న చెప్పారు.

గృహ నిర్బంధాలు..

శ్రీకాకుళంలోనూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. వారి ఇళ్ల వద్ద భారీ బందోబస్తు పెట్టారు. పోలీసుల తీరుపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. తర్జనభర్జనల తర్వాత పోలీసులు ఎంపీకి అనుమతిచ్చారు. ఆయన పలాసలోని తెదేపా కార్యాలయానికి వెళ్లి.. కాసేపు అక్కడి తెదేపా నేతలతో మాట్లాడారు.

144 సెక్షన్ విధింపు..

పలాసలోని లచ్చన్న విగ్రహం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్‌ విధించారు. తెదేపా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీనిపై పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న విగ్రహం వివాదం

ఇదీ చదవండి: తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...

ABOUT THE AUTHOR

...view details