ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ యువతి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు' - హైకోర్టు వార్తలు

న్యాయస్థానంలో హాజరయ్యేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని గ్రామ వాలంటీరు నిర్బంధించిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. యువతి తల్లిదండ్రులపై స్థానిక అధికారులు ఒత్తిడి తెచ్చి... తెల్లకాగితాలపై వేలిముద్రలు తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

high court
high court

By

Published : Apr 23, 2022, 4:28 AM IST

శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 23న తమ కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా... బాల్య వివాహం పేరుతో స్థానిక అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఎం.ఆదినారాయణ అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి... ఈ నెల 21న జరిగే విచారణ కోసం హైకోర్టుకు రావాలని యువతి తల్లిదండ్రులను కోరానని హైకోర్టుకు తెలిపారు. అయితే 20వ తేదీ రాత్రి విజయవాడకు బయలుదేరిన వారు అదృశ్యమయ్యారని చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం... శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచాలని శ్రీకాకుళం కలెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు పోలీసులు ఆ కుటుంబాన్ని హైకోర్టుకు తీసుకొచ్చారు. వారితో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నేరుగా మాట్లాడారు.

ఎల్​.ఎన్​.పేట మండలం రావిచెంద్రి గ్రామానికి చెందిన వాలంటీరు సిరిపురపు రవి... ఆ రోజు ఇంటికి తాళం వేసి తమను నిర్బంధించారని బాధితులు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, శిశు సంక్షేమశాఖ అధికారులు తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారని వివరించారు. వాదనల అనంతరం స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవవానంద్... కేవలం పాఠశాల అధికారులు ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ఆమె వివాహాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఇతర ధ్రువపత్రాలను పరిశీలిస్తే ఆమె వయసు 20 ఏళ్లుగా ఉందన్నారు. ఆ యువతి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు. బాధితులను నిర్బంధించడం, వేలిముద్రలు తీసుకోవడంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణను జూన్‌ 15కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి:తండ్రీ, కుమార్తె అదృశ్యానికి కారణాలు తేల్చండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details