స్తంభించిన రాకపోకలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు వద్దనున్న బుడుమూరు పెద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి.
నీట మునిగిన వేల ఎకరాల పంటలు
ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దీంతోపాటు పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. పంటలు వర్షాలకు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు కోరుతున్నారు.
నీట మునిగిన ఇళ్లు, దేవాలయాలు, పాఠశాలలు
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి, గుల్లలపాడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. దేవాలయాలు, ఇళ్లలోకి నీరు చేరింది. సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత పాఠశాల నీట మునిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఉద్ధతృంగా వంశధార, నాగవళి
వర్షాలకు వంశధార, నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గురువారం నుంచి ఈ నదుల్లో నీటిప్రవాహం పెరుగుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు వంశధార నది దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.