శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లావేరు మండలంలోని బుడుమూరు పెద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించి 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెజ్జిపురం గ్రామ సమీపంలో ఉన్న దేవునివానిచెరువు నుంచి వరద నీరు ఉద్ధృతంగా గ్రామంలోకి ప్రవహిస్తుంది. పాతరౌతుపేట సమీపంలో ఉన్న చిట్టగెడ్డ ప్రవాహానికి రహదారి కోతకు గురైంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నియోజకవర్గంలో 2 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలైందనీ.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేశారు.
పాలకొండ నుంచి పార్వతీపురం అంతర్రాష్ట్ర రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మోకాలు లోతున నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో గెడ్డలు పొంగి ప్రవహించి బాసూరు, బీపీ రాజుపేట, తుమరాడ, టమోటాపల్లి గ్రామాల పరిధిలోని వెయ్యి ఎకరాల్లో పంట నీటమునిగింది.