శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం సైలాడ వద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. గండి పడే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడగా.. పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బూర్జ మండలం లక్ష్మీపురంలోని చెక్ డ్యామ్ నుంచి లక్కవరంలోకి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
వరి విరిగి పోతుందని విలవిలలాడుతున్న రైతాంగం - శ్రీకాకుళంలో చెరువులకు గండ్లు
భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. గండి పడి పంటలు కొట్టుకుపోతాయేమోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బుర్జ, పొందూరు మండలాల్లోని రైతాంగం, గ్రామస్థులు భయపడుతూ గడుపుతున్నారు. వరి పంటకు ప్రమాదం పొంచి ఉండటంతో గగ్గోలు పెడుతున్నారు.
భారీ వర్షాలు
వరి పంట పొట్ట దశలో ఉందనీ.. అకాల వర్షాల ధాటికి ధాన్యం విరిగే అవకాశముందని సరుబుజ్జిలి, పొందూరు మండలాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నాట్లు వేసే సమయంలో వానలు లేక పంట ఎండిపోతుందని భయపడగా.. ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధృతంగా వర్షాలు.. ఒకరు గల్లంతు