బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నరసన్నపేటలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. పొలాలు నీటమునిగాయి. మరింతగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సాగర తీరంలో అలజడి...
వర్షాలకు సాగర తీర ప్రాంతం కమిటీ డొంకూరు వద్ద సముద్రంలోని అలజడి పెరిగింది. ఉవ్వెత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే సముద్రం 10 మీటర్లు ముందుకు రావడం వల్ల తీరం వద్ద కోతకు గురైంది. ఫలితంగా మత్స్యకారులు వలలు ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అక్కడే నివాసముంటున్న మత్స్యకారులు భయంతో బిక్కు మంటున్నారు.