HC Judge visit hostel: విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని.. సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని జేసీ విజయసునీతతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి.. ఆరుగురు విద్యార్థినులు ఉండాల్సిన ఒక గదిలో.. 36 మంది ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అలాగే మరుగుదొడ్ల కొరతను కూడా గమనించారు.
అనంతరం విద్యార్ధినులకు స్వీట్లను పంచిపెట్టిన హైకోర్టు న్యాయమూర్తి.. వారితో కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థినులు సాధించాలనుకున్న లక్ష్యాలను ఆరా తీసిన న్యాయమూర్తి.. ప్రతి రోజు వార్త పత్రికలు చదవాలని సూచించారు.