ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gulab Effect: గులాబ్ తుపాను గుబులు.. శ్రీకాకుళంలో భారీ వర్షాలు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Gulab cyclone
గులాబ్ తుపాను

By

Published : Sep 26, 2021, 12:34 PM IST

Updated : Sep 26, 2021, 4:16 PM IST

గులాబ్ తుపాను

తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్​కు140 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, విదర్భకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గులాబ్‌ తుపాను దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని కుదించారు. మరికొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

గులాబ్ తుపాను ముంచుకొస్తున్న తరుణంలో.. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది. గార, కవిటిలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా పరిధిలో తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో.. కలెక్టర్‌ శ్రీకేశ్​ లాఠకర్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు, మెరైన్‌, విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను పరిస్థితులను బట్టి ఆపదలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

గులాబ్ తుఫాన్ కారణంగా తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పరిధిలోని పలు తీరప్రాంత గ్రామాల్లో ఆయన పర్యటించారు . అధికారులతో సమీక్షించారు. గుప్పెడు పేట , రాజా రాంపురం.. గ్రామాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు.

గులాబ్ తుపాను

ఈ తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని 27 గ్రామాల్లో మత్స్యకారులు.. అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బారువ, పొగరు వద్ద సుమారు 100 బోట్లను లంగరు వేసి ఉంచుకున్నామని.. మహేంద్రతనయ నుంచి భారీగా వరద వస్తే.. ఆ బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన వలలు, బోట్లు పాడవకుండా అధికారులు ముందస్తు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తమ గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆందోళనలో మత్సకారులు

జగన్​తో మాట్లాడిన ప్రధాని మోదీ..

గులాబ్‌ తుపాను గురించి సీఎం జగన్‌తో ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలిపారు. తుపాను ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందుతుందని సీఎంకు ప్రధాని తెలిపారు. తుపాను ప్రాంతాల్లోని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ఆకాంక్షించారు.

విద్యుత్​ సమస్యల కోసం..

'గులాబ్' తుఫాను ప్రభావంతో కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ 1912 కి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు విజ్ఞప్తి చేశారు. విద్యుత్​ పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు సంస్థ డైరెక్టర్లు, ఆపరేషన్స్, ప్లానింగ్, కమర్షియల్, మెటీరియల్ పర్చేజస్ విభాగపు అధికారులతో సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కె. రాజబాపయ్య శ్రీకాకుళం సర్కిల్, డైరెక్టర్ ఆపరేషన్స్ బి. రమేష్ ప్రసాద్ విజయనగరం సర్కిల్, డైరెక్టర్ ఫైనాన్స్ డి.చంద్రం విశాఖపట్నం సర్కిల్ల పునరుద్దరణ చర్యలను పర్యవేక్షిస్తారని తెలిపారు.

తుఫాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లను, విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్​ఫార్మర్లను సరిచేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అప్రమత్తంగా, అందుబాటులో ఉంచాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సీఎండి ఆదేశాలిచ్చారు.

కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు..

కార్పోరేట్ ఆఫీసు

9440816373

8331018762

సిజీఎం ఆపరేషన్స్ 9440812567
జిఎం కాల్ సెంటర్ 9440814206
శ్రీకాకుళం 9490612633
పాలకొండ 7386764579
టెక్కలి 6305107900
విజయనగరం 9490610102
బొబ్బిలి 9492666989 / 9490610121
పార్వతీపురం 9440814205
విశాఖపట్నం 7382299975
అనకాపల్లి 9885262424
నర్సీపట్నం 9491030714
పాడేరు 9490610026

ఇదీ చదవండీ..Corona Cases In India: దేశంలో మరో 28 వేల మందికి కరోనా

Last Updated : Sep 26, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details