ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Power Holiday Problems: విద్యుత్ కోతలతో పరిశ్రమలకు "కరెంట్ షాక్" - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

Power Holiday Problems: అధికార, అనధికార విద్యుత్ కోతలు ప్రజలనే కాక, పరిశ్రమలనూ వేధిస్తున్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమలపై కరెంట్ కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యజమానులు వాపోతున్నారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న శ్రీకాకుళంలోని వందల పరిశ్రమల పరిస్థితిపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం..

Power Holiday Problems
విద్యుత్ కోతలతో పరిశ్రమలకు "కరెంట్ షాక్"

By

Published : Apr 10, 2022, 3:28 PM IST

Power Holiday Problems: విద్యుత్‌ కోతలు శ్రీకాకుళం జిల్లాలోని పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమలు నడిపినా.. వ్యయం తడిసిమోపెడవుతుందని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోపక్క గంటల తరబడి విద్యుత్ నిలిపివేతతో కార్మికులకూ పనిలేకుండా పోతోంది. కరెంటు కొరతతో సోమవారం జిల్లాలో పవర్ హాలీడే అమలు చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ (EPDCL) ప్రకటించింది.

విద్యుత్ కోతలతో పరిశ్రమలకు "కరెంట్ షాక్"

కరెంటు కోతలు శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో 20 భారీ, 300 వరకు పెద్ద పరిశ్రమలున్నాయి. వీటికి రోజుకు 300 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగినందున వారం రోజులుగా 325 మెగావాట్లకు పైగా కరెంటు వినియోగిస్తున్నారు. పెద్ద పరిశ్రమలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకే సరఫరా ఉంటుంది. దీనిలో ఒక షిఫ్ట్‌కు మాత్రమే ఉత్పత్తికి విద్యుత్ వినియోగించాలి. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తారు. భారీ పరిశ్రమలకు కేటాయించిన విద్యుత్​లో 50 శాతమే వినియోగించుకోవాలని ఆదేశాలొచ్చాయి. దీంతో పరిశ్రమల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గ్రానైట్ రంగం విద్యుత్ కోతలతో విలవిల్లాడుతోంది. జిల్లాలో 98 గ్రానైట్ పరిశ్రమలున్నాయి. దాదాపు 3 వేల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కోతలతో రోజువారీ ఆదాయంలో 40 శాతం నష్టపోతున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 6 గంటల నుంచి కనీసం 8 గంటలమేర కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. కోతలున్నా కనీస కరెంటు బిల్లు ఛార్జీలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు సగటున 2 నుంచి 3 లక్షల ఆదాయం కోల్పోతున్నట్లు గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. వేతనాలు, ఇతర ఖర్చులు తీసేస్తే...లాభాలు రాకపోగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

పలాస, కాశీబుగ్గ పరిధిలోని వందలాది జీడి పరిశ్రమల్లో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన రణస్థలం మండలం పైడిభీమవరంలో రసాయన, ఔషధ పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్ కోతల ప్రభావం వీరిపై పడింది. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది.

ఫార్మా కంపెనీల్లో కరెంటు సరఫరా నిలిచిపోతే జనరేటర్లను నమ్ముకోవాల్సిందే. ఒకసారి వీటిలో ఉత్పత్తి నిలిపివేస్తే తిరిగి ప్రారంభించేందుకు 2 రోజులు సమయం పడుతుంది. సాధారణంగా విద్యుత్తుతో పరిశ్రమను నడిపితే లక్ష వ్యయమైతే.. జనరేటర్‌తో నడిపితే రెండింతలవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. అధికారికంగా పవర్ హాలీడేతో తాము ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలకు రాత్రివేళల్లో కోతలు విధిస్తున్నామంటూ అధికారులు ఈ కారణంగా గృహ వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. జిల్లాకు రోజుకు 3 వందల 20 మెగావాట్ల విద్యుత్తు అవసరం. కానీ 280 మెగావాట్లు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా 40 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:KRMB-GRMB: పూర్తిస్థాయి సమావేశానికి నదీ యాజమాన్య బోర్డులు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details