Vamsadhara floods: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గెడ్డవానిపేట గ్రామానికి ప్రతి ఏటా వంశధార నది వరదల కారణంగా కోతకు గురై గ్రామం కుచించుకుపోతుంది. గ్రామానికి కరకట్టలు లేకపోవడంతో నదీ వేగానికి గ్రామం కోతకు గురై గూడు కోల్పోయి.. గత పదేళ్లలో 30 కుటుంబాలు గ్రామం వదిలి వలస బాటపట్టాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గెడ్డవానిపేట గ్రామ ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తారు. ప్రతి ఏటా వస్తున్న వరదలతో నీటి ప్రవాహం కారణంగా గడ్డవానిపేట గ్రామం కొద్దికొద్దిగా నది గర్భంలో కలిసిపోతుంది. 10 సంవత్సరాల క్రితం గ్రామానికి 150 మీటర్ల దూరంలో ఉన్న నది ఇప్పుడు గ్రామానికి ఆనుకొని ఉంది. ఒకప్పుడు గెడ్డవానిపేట గ్రామంలో 150 కుటుంబాలు నివసించేవి, గ్రామంలోని మూడు వీధులు నదీ గర్భంలో కలిసిపోవడంతో 30కి పైగా కుటుంబాలు ఇళ్లు కోల్పోయి సొంత స్థలం లేక దిక్కుతోచక వేరే ప్రాంతాలకి తరలిపోయారు. ఒకప్పుడు అక్కడ మనుషులు నివాసం ఉండేవారనడానికి ఆడవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ప్రతి ఏడాది నది ప్రవానికి 10 నుంచి 15 మీటర్లు గ్రామం పోతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని మానుకోకపోతే గ్రామం పూర్తిగా నది గర్భంలో కలిసిపోతుంది అంటున్నారు.