ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ఉచిత విద్యుత్‌పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న వై.యస్.ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులు అపోహలు చెందవలసిన అవసరం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ అవుతుందన్నారు. వ్యవసాయ మోటార్లలకు విద్యుత్ మీటర్లు పెట్టడం వలన పారదర్శకమైన విద్యుత్ సరఫరా రైతులకు అందుతుందన్నారు. దీనివలన రైతులపై పైసా కూడా భారం పడదన్నారు.
జిల్లాలో ఉన్న 25,288 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో 9638 కనెక్షన్లు ఉన్నాయని తెలియజేశారు. పథకానికి సంబంధించి రైతులు తమ బ్యాంకు ఖాతాలు ప్రారంభించవలసి ఉంటుందన్నారు.