నామినేషన్లు, ఉప సంహరణలు, ప్రచారాలు, పోలింగ్, ఫలితాలూ అన్నీ తేలేందుకు 24 రోజుల సమయం పట్టింది. జిల్లాలో 38 మండలాలుండగా 10, 10, 9, 9 నాలుగు విడతల వారీగా పోలింగ్ నిర్వహించారు. చివరిదశలో 259 సర్పంచ్, 1915 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. జిల్లాలో మొత్తం 83.81 పోలింగ్ నమోదు కాగా.. పారిశ్రామిక ప్రాంతం, స్థానికంగానే ఉపాధి దొరికే రణస్థలం మండలంలో 88.86 శాతం పోలింగ్ జరిగింది. గార మండలంలో అత్యల్పంగా 80.43 శాతం మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పోటెత్తారు..
శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది మండలాల్లో ఆదివారం చివరిదశ ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6.30 నుంచే ఓటర్లు పోటెత్తారు. ఎచ్చెర్ల మండలం బడివానిపేటలో వేకువజామున నాలుగు గంటలకే భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. ఉదయం నుంచీ అన్ని కేంద్రాలూ ఓటర్లతో కిటకిటలాడాయి. ఓటేసే సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. పోలింగ్ సమయం ముగిసేసరికి 83.81 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. చాలా గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఫలితాలు వేగంగానే వెలువడ్డాయి.
ఈసారి పెరిగింది..
తొలి రెండు దశల్లో పోలింగ్ శాతం జిల్లా యంత్రాంగాన్ని నిరాశపరిచింది. ఆయా దశల్లో ఎన్నికలు జరిగిన మండలాల్లో వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత వీరంతా ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.ఈలోగా ఎన్నికలు రావడంతో వెనక్కి రాలేకపోయారు. ఫలితంగా ఓటింగ్ పైనా తీవ్ర ప్రభావం పడింది. చివరి రెండు దశల్లో వలసలు కాస్త తక్కువ కావడంతో ఓటింగ్ మెరుగుపడింది. నాలుగో విడతలో వలస ఓటర్లు ఉన్నా వారంతా దగ్గరలోని విశాఖ కేంద్రంగానే ఉపాధి కోసం వెళ్లినవారు కావడంతో ఓటేసేందుకు తిరిగొచ్చారు. దీనికితోడు ఆదివారం సెలవుదినం కలసిరావడంతో ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు.