అనారోగ్యంతో మరణించిన జవానుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. కోల్‌కతాలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న జవాను జి.జయరాం ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. కోల్‌కతా నుంచి తరలిస్తున్న మృతదేహానికి ఎస్కార్ట్, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం ఉదయం ఆర్‌ఎస్‌ఐ జమినివలస కృష్ణుడు(58), హెడ్‌కానిస్టేబుల్స్ యండ బాబూరావు(53), టింగ ఆంటోని(50), కానిస్టేబుల్ పైడి జనార్దనరావు(47)... మందస మండలంలోని బైరిసారంగిపురం వెళ్లారు. అంత్యక్రియల అనంతరం వారు తిరిగి ఎచ్చెర్లలోని ఏఆర్ కార్యాలయానికి బయలుదేరారు. వాహనాన్ని జనార్దనరావు నడుపుతున్నారు. సుమ్మాదేవి కూడలి దగ్గరకు రాగానే వాహనం అదుపు తప్పింది. డివైడర్ మీదుగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి... తిరిగి డివైడర్‌పై ఎగిరి పడింది. వాహనంలోని నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకొన్న కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని... కొనఊపిరితో ఉన్న ఆంటోనీని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
మిన్నంటిన రోదనలు..
మృతదేహాలను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు.
తీవ్రవిషాదంలో కుటుంబాలు
మృతి చెందిన పోలీసుల కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది. ఏఆర్ ఎస్సై కృష్ణుడు సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం పంచాయతీ వెంకంపేటకు చెందినవారు. ఆయన భార్య ఇప్పటికే మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తల్లి చనిపోగా అన్నీతానై చూసుకుంటున్న తండ్రి కూడా దూరం కావటంతో పిల్లల దుఃఖానికి అంతే లేకుండాపోయింది. హెడ్‌కానిస్టేబుల్ బాబూరావు టెక్కలి మండలం పులిబంద గ్రామానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కుమార్తె ఫోన్‌చేసి భోజనానికి వస్తున్నారా అని అడగ్గా ఇప్పుడు రాను... రాత్రి వేళకు వస్తానని చెప్పారని అవే చివరి మాటలని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ ఆంటోని భామిని మండలం బత్తిలి గ్రామానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. కానిస్టేబుల్ పైడి జనార్దనరావుది ఆమదాలవలస మండలం లొద్దలపేట గ్రామం. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.