పిల్లలకు పెళ్లిళ్ల విషయంలోనూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని నువ్వలరేవు అనే ఊరు తరాలుగా పాటిస్తున్న ఐక్యత అబ్బురపరుస్తోంది. 34 వీధులు, 4 వేల 8వందల గడపలు, 12 వేల మంది జనాభా గల విశాలమైన ఈ గ్రామంలో యువతీ యువకులందరికీ ఒకేరోజు వివాహాలు జరుగుతాయి. కట్టుబాట్లను కచ్చితంగా పాటించే వారంతా తమ గ్రామంలోని వారితోనే సంబంధాలు కుదుర్చుకుంటారు. మూడేళ్లకు ఒకసారి మాత్రమే సామూహికంగా బాజాభజంత్రీలు మోగే ఆ అరుదైన ఘట్టం రానే వచ్చింది. ఈ తెల్లవారుజామున 2 గంటల 36 నిమిషాలకు 42 జంటలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి.
వినూత్న పెళ్లితంతు...
పెళ్లితంతు కూడా వినూత్నంగానే సాగుతుంది. ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ఆభరణాన్ని అమ్మాయి, అబ్బాయి మెడలో కడుతుంది. పెళ్లైన మూడు మాసాల్లోపు ఆ ఆభరణాన్ని కరిగించి మంగళసూత్రంలా తిరిగి ధరిస్తుంది. కట్నం తీసుకొనే ఆచారానికి వారు దూరం. అయితే... లాంఛనాలు, సారె ఘనంగానే ఉంటాయి.