Migratory birds: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం గ్రామానికి విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు పేరు దాదాపు రెండున్నర శతాబ్దాలుగా ఇక్కడ ప్రతి ఏడాది సెప్టెంబరు, అక్టోబర్ నెలలో సంతాన ఉత్పత్తి కోసం పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే 2 జాతుల పక్షులు రావడం అనవాయితీ. ఈ వలస పక్షులు పచ్చని పల్లె వాతావరణంలో ఉండే చింత, వెదురు చెట్లపై గూళ్ళు కట్టుకొని మార్చి, ఏప్రిల్ నెల వరకు ఇక్కడే జీవిస్తాయి, ఏప్రిల్ నెల తర్వాత తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని మాతృదేశానికి తిరిగి పయనమవుతాయి. ఈ విదేశీ అతిథులకు ఎటువంటి హాని కలగకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. గ్రామంలో 500 కు పైగా పక్షి గూళ్ళు ఉంటాయి పిల్లలను కనేందుకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉండడంతో వాటికి కావాల్సిన ఆహారం ఇక్కడ ఉప్పుటేరులో దొరకడం వల్లే ఇవి వస్తాయని చెబుతున్నారు.
నేను 30 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నా. సైబీరియా నుంచి రెండు రకాల పక్షులు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటాయి. 1979 నుంచి ఇక్కడ పర్యవేక్షణ ఉంటుంది. ఒక్కో పక్షి 4గుడ్లు పెడుతుంది. 120రోజుల్లో పిల్లలు పెరిగి పెద్దయ్యాక తిరిగి వెళ్లిపోతాయి. - విశ్వేశ్వరరావు, విదేశీ పక్షుల సంరక్షకుడు
శతాబ్దాలుగా విదేశీ వలస పక్షుల రాక కోసం తేలినీలాపురం గ్రామస్తులు ఎదురు చూస్తుంటారు, పక్షులను గ్రామస్తులంతా అతిథులుగా భావించి పవిత్రంగా చూస్తూ ఎటువంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేస్తుంటారు, పక్షులు రావడం వల్ల పాడిపంటలు ఆరోగ్యం గ్రామస్తులకు చేకూరుతుందని, పక్షులు రాకపోతే ఏదో పకృతి వైపరీత్యం కచ్చితంగా సంభవిస్తుందని గ్రామస్తులు నమ్మకం.
మా ఊరు పక్షుల విహార కేంద్రం. పక్షులకు పుట్టినిల్లు. సుమారు 500 సంవత్సరాల నుంచే విదేశీ పక్షులు ఇక్కడకు వస్తున్నట్లు మా పూర్వీకుల ద్వారా తెలిసింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ముందు ఇక్కడకు వస్తాయి. తిరిగి మే నెలలో వెళ్లిపోతాయి. ఇవి ఇక్కడకు వచ్చిన రోజును మేం శుభదినంగా భావిస్తాం. వాటి రాకతో ఎంతో శుభం జరుగుతుంది. ఆరోజున పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయిస్తాం. గతంలో ఓసారి పక్షులు రాకపోవడంతో ఆ ఏడాది తీవ్రమైన కరువు వచ్చినట్లు మా పూర్వీకులు చెప్పారు. అటవీ శాఖ నుంచి రక్షణ కల్పించాలి. - వెంకటరమణమూర్తి, స్థానికుడు