ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారుల నుదుట గుజ‘రాత’

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వెళ్లిన బోట్లలోనే నిద్రాహారాలు చేస్తున్నారు. గుజరాత్ నుంచి శ్రీకాకుళం పంపించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు.

srikakulam district
లాక్‌డౌన్‌ పొడిగిస్తే వసతి కల్పిస్తామంటున్న గుజరాత్‌ అధికారులు

By

Published : Apr 10, 2020, 2:02 PM IST

గుజరాత్‌ రాష్ట్రం ‘వెరావల్‌’లో అసౌకర్యాల నడుమ మగ్గిపోతున్న శ్రీకాకుళం మత్స్యకారుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి ఆవేదన ఆలకించే నాథుడే కనిపించటం లేదు. జిల్లా నుంచి వెళ్లిన సహాయ బృందం ఆదుకునేందుకు శతథా ప్రయత్నిస్తోంది.

వెరావల్‌లో ఉన్నవారిలో దాదాపు అయిదు వేల మంది మత్స్యకారులు క్రమంగా సాగరం నుంచి ఒడ్డుకు చేరుకుని బోట్లనే ఆవాసాలుగా మార్చుకుని కొన్ని రోజులుగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వారు 500 మంది ఉంటారని.. మిగిలిన వారంతా సిక్కోలు వాసులేనని బాధితులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. కొందరు బోటు యజమానులు మత్స్యకారులకు కొంతమేర నిత్యావసర సరకులు ఇచ్చారు.

సాధారణంగా ఏప్రిల్‌లో అక్కడి నుంచి స్వగ్రామాలకు వస్తుంటారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేటతో సంపాదించుకున్న మొత్తాన్ని అక్కడే ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల కిందట అనారోగ్యంతో ఒకరు మృతి చెందడంతో వారిలో ఆందోళన అధికమవుతోంది.

గుజరాత్‌లోని సోమనాథ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసిన సిక్కోలు బృందం

జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు నరసింగరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారుల బృందం అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. అధికారుల్లో కూడా వీఆర్వో, ఆర్‌ఐలే వెళ్లారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు అక్కడి పరిస్థితులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు అందడంతో వాటిని సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. బోట్లలో దోమల బెడద బాగా ఎక్కువగా ఉంది.

ఈ క్రమంలో వారందరికి దోమ తెరలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. బియ్యం, దుప్పట్లు, దోమ తెరలు, సబ్బులు, మాస్కులు, ఉల్లిపాయలు, పప్పులు, బంగాళాదుంపలతో సహా పది రకాల నిత్యావసరాలను కిట్ల రూపంలో అందించేందుకు బృంద సభ్యులు ప్రయత్నిస్తున్నారు. వారున్న ప్రాంతంలో దోమ తెరలు లభ్యం కాకపోవడంతో.. వాటిని సమకూర్చుకోడానికి కృషి సాగిస్తున్నారు.

‘ముఖ్యమంత్రి స్పందనపైనే మా ఆశలు’

శ్రీకాకుళం బృందం గుజరాత్‌లోని సోమనాథ్‌ కలెక్టరును కలిసి మత్స్యకారులను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని.. లేదంటే వసతి కల్పించాలని కోరింది. ఈ నెల 14 తరవాత కూడా లాక్‌డౌన్‌ పొడిగిస్తే.. ఆ తరవాత ఏవైనా వసతి గృహాల్లో వసతి కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు బృందం తెలిపింది. అంత వరకు బోట్లలోనే సర్దుకోవాల్సిందిగా సూచించారని అన్నారు.

'వెరావల్‌’లో ఉన్న జిల్లా మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని గుజరాత్‌ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చామని..వారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటంలేదని జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేక రైలు లేదా బస్సులు ఏర్పాటు చేసి అందరినీ సిక్కోలు పంపించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞాపన చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల ఆవేదనను.. బాధను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నామని అని జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నరసింగరావు విన్నవించారు.

ఇదీ చదవండి:

వలస కూలీలకు యోగా తరగతులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details