శ్రీకాకుళం జిల్లా అధికారుల తీరుతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం జిల్లాలోని పొందూరు మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే 30 పడకల సామాజిక ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... అధికారుల తీరును తప్పుబట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో రెండో పెద్ద పంట అయిన మొక్కజొన్నకు ప్రభుత్వం 1850 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. గతంలో ఇది 1750 రూపాయలు ఉండేది. పొందూరు మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఆలస్యంగా పెట్టడం వల్ల రైతులు ఈ సీజన్లో నష్టపోయారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే 600 రూపాయలు తక్కువకు దళారులు మొక్కజొన్నను కొన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వలన రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా యంత్రాంగం పని చేయాలి- తమ్మినేని సీతారాం, సభాపతి