Farmers Protest: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు రోడ్డు కోసం చేస్తున్న భూ సేకరణకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూ సేకరణ కోసం పలు గ్రామాలలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ జరుగుతుండగా.. రైతులు కుర్చీల నుంచి పైకి లేచి నినాదాలు చేశారు. రైతుల పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. పోర్టు ప్రాంతం నుంచి జాతీయ రహదారిని అనుసంధానించే 100 మీటర్ల వెడల్పు రహదారి నిర్మిస్తే తమ జీవనోపాధిగా ఉన్న భూములన్నీ పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిహారం ఎంత ఇచ్చినా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, గ్రామ సభలు బహిష్కరిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా రెవిన్యూ అధికారులకు అందజేసి నినాదాలు చేశారు. సెంటు భూమికి కోటి రూపాయలు ఇచ్చినా తమ భూములను మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపాదించిన రహదారిని కాదని ఇప్పుడు తమ భూముల మీదగా రహదారిని నిర్మిస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు రోడ్డుకి భూ సేకరణ కోసం టెక్కలి, బన్ను వాడలలో రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో సంబంధిత సర్పంచులు గొండేల సుజాత, పోలాకి మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు చోట్ల రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెక్కలిలో 23వ తేదీన సాయంత్రం సమావేశం జరగాల్సి ఉండగా, దానిని రద్దు చేసి అర్ధాంతరంగా శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. కొద్దిమందికే ఈ సమాచారం తెలిసినా పాల్గొన్నవారంతా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తూ వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్ గిరిబాబుకు అందజేశారు.