అన్నదాతలకు జీవనాడిగా భాసిల్లే శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఆయకట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కాలువ చివరి భూములకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. 1970లో వంశధార కాలువలు ఆవిర్భవించిన తరువాత పక్కాగా మరమ్మతులకు నోచుకోనే లేదు. దీంతో ఎగువ భూముల రైతులకే వంశధార నీరు లభ్యమై చివరి భూములకు ప్రశ్నార్థకంగా మారింది.
చివరి ఆయకట్టుకు అందని వంశధార నీరు
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఆయకట్టు చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు రాకపోవటంతో...పలు మండలాల్లో ఖరీఫ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవటంతో... ప్రవాహం కుచించుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంశధార నది నుంచి లక్షా నలభై ఎనిమిది వేల 242 ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా, మరో 68 వేల ఎకరాల ఆయకట్టుకు కుడి కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలన్న ప్రణాళిక... ఆచరణకు నోచుకోవటం లేదు. ప్రతి ఏటా కాలువ చివరి భూముల రైతులు ఆందోళన చేయడం సాధారణంగా మారింది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి తదితర మండలాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు చేరలేదు. దీంతో ఖరీఫ్ సాగు ఆరంభం కాలేదు. ఈ నేపథ్యంలో కాలువ చివరి భూముల రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా... సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ నివాస్ వంశధార పర్యవేక్షక ఇంజినీర్ పీ.రంగారావుకు చక్కదిద్దే పని అప్పగించారు.
- చుక్కనీరు కూడా రావట్లేదు...
నరసన్నపేట డివిజన్లో పలు మండలాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే టెక్కలి డివిజన్ లోని మండలాలకు సాగునీరు అందక సాగు పని ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వంశధార ఎడమ కాలువకు 1,850 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టారు. కానీ టెక్కలి డివిజన్ కు చుక్కనీరు కూడా వెళ్లడం లేదు. 25.ఆర్ మేఘవరం మేజర్ కాలువ వరకు సాగునీరు వెళ్తుండగా అక్కడినుంచి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నీటి ప్రవాహం కుచించుకుపోతుంది. ఈ నేపథ్యంలో వంశధార పర్యవేక్షక ఇంజినీర్ పి.రంగారావు ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం మంగళవారం వంశధార ఎడమకాలువను పరిశీలించారు. కాలువ చివరి భూములకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని వంశధార ఎసీ ఈ రంగారావు అన్నారు. వర్షాభావం కారణంగా సాగు నీరు సరఫరాలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.