శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు ఫొని కన్నీటిని మిగిల్చింది . ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడం మండలాల్లో బొప్పాయి, చెరకు, అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెనుగాలులకు చేతికందివచ్చిన బొప్పాయి పంట నేలపాలు కావటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. సుమారుగా 700 ఎకరాల్లో పలు రకాలు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు.
తాగునీటికి ఇక్కట్లు...
గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలో 48 గంటలగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోయారు. చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ మోటార్లు అమర్చినందువల్ల విద్యుత్ ఉంటేనే తాగునీరు వచ్చే పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయలేదని ప్రజల ఆరోపిస్తున్నారు.