SRI KURMAM TEMPLE : ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.. అధికారుల నిర్లక్ష్యానికి గురై కునారిల్లుతోంది. కూర్మావతార రూపంలో మహావిష్టువును చూసేందుకు వచ్చే భక్తులకు.. పెచ్చులూడుతున్న గోడలు, నాచుపట్టిన శ్వేత పుష్కరిణి, నిరుపయోగంగా మారిన ధర్మసత్రం.. స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం, ఆలయ అధికారులతో పాటు దాతలు చొరవ చూపి పుణ్యక్షేత్రాన్ని ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీకాకుళం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మంలో శ్రీమహావిష్ణువు కూర్మావతార రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ మహా పుణ్యక్షేత్రాన్నిరెండో శతాబ్దానికి ముందే నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. చోళ, కళింగ, ఆంధ్రతో పాటు అనేక రాజవంశీయులు.. ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దానికి చెందిన శాసనాలతో పాటు ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్వయంగా దేవతలే శ్రీకూర్మనాథ స్వామి వారిని ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. ఎంతో ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో బీటలు వాలుతోంది. గర్భాలయం ప్రధాన ప్రహరీ గోడలు పెచ్చులూడుతున్నాయి.