పాలకొండలో రైతుబజారు నిర్మించాల్సిన ప్రదేశం ఇదే పాలకొండలో రైతుబజారు నిర్మించాల్సిన ప్రదేశం ఇదే
శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, నరసన్నపేట, పలాస, కొత్తూరులో రైతుబజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పనుల విషయంలో జాప్యం కారణంగా ప్రజలకు, రైతులకు అందుబాటులోకి రాలేదు. జిల్లాలో దాదాపు మూడువేల హెక్టార్లలో కూరగాయల సాగవుతోంది. వీటిపై ఆధారపడి సుమారు 15 వేల మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. కానీ వీరికి గిట్టుబాటు ధర మాత్రం రాలేదు. రైతుబజార్లు లేక దళారులు, వ్యాపారులకు నేరుగా విక్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నవారు మూడింతలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు ఇటు ప్రజలకు భారంగా మారుతుంటే వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులే నేరుగా తమ పంటను విక్రయించేందుకు వీలుగా రైతుబజార్లు అందుబాటులోకి వస్తే ప్రయోజనం కలుగుతుంది.
ఇదీ పరిస్థితి..
పాలకొండ పట్టణ నడిబొడ్డున 50 సెంట్ల విస్తీర్ణంలో రూ.88 లక్షల వ్యయంతో రైతుబజారు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. ఇందుకోసం ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో మారు టెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ● కొత్తూరు ప్రధాన కూడలిలో రైతుబజారు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. 35 సెంట్ల స్థలంలో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇంకా ఆమోదం రావాల్సి ఉంది. ● పలాసలో ఇప్పటికే తాత్కాలిక రైతుబజారును గతంలోనే ప్రారంభించారు. స్థల సేకరణ జరగాల్సి ఉంది. ● నరసన్నపేటలోనూ స్థల సేకరణ పనిలో అధికారులు ఉన్నారు. ● రాజాంలో రైతుబజారు నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం కరోనా కారణంగా అధికారులు ప్రారంభానికి వెనుకంజ వేస్తున్నారు.
నిర్మాణాలకు చర్యలు
ప్రభుత్వం జిల్లాలో అయిదుచోట్ల రైతుబజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాలకొండలో రెండుసార్లు టెండర్లు పిలిచాం. గుత్తేదారులు ముందుకు రాలేదు. త్వరలోనే మరోసారి పిలుస్తాం. రాజాంలో రైతు బజారు సిద్ధంగా ఉన్నా, రద్దీ అధికంగా ఉంటుందన్న కారణంగా ప్రారంభించలేదు. రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపడతాం. మంజురైన అన్నిచోట్లా తొందరలోనే పనులు చేస్తాం. - ఎ.శ్రీనివాసరావు, ఏడీ, మార్కెటింగ్
ఇదీచదవండి