Bhavanapadu Port News: భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. మూలపేట గ్రామంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణంపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి 1,010 ఎకరాలు అవసరమని, దీనిలో కేవలం 300 ఎకరాలు మినహా మిగిలిందంతా ప్రభుత్వానిదేనన్నారు. పోర్టు వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నైపుణ్యం ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, మత్స్యకారులకు జీవనోపాధి మెరుగవుతుందని పేర్కొన్నారు. దీనిపై గ్రామస్థులు మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదించినట్లు భావనపాడు-దేవునల్తాడ మధ్యలో పోర్టు నిర్మిస్తే తమకు ఎలాంటి అభ్యంతరంలేదన్నారు.
'పోర్టు వస్తే తమ జీవితాలు నాశనం అవుతాయి.. ఇక్కడ వద్దే వద్దు'
భావనపాడులో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణంపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధ్యక్షతన జరిగింది. భావనపాడు పోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దని జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పోర్ట్ వస్తే తమ జీవితాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో మూడుసార్లు నోటిఫికేషన్లు విడుదల చేసి ఇప్పుడు పోర్టు నిర్మిత ప్రాంతం మార్చి తమ గ్రామాలను పూర్తిగా తొలగించాలనుకోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆరోపించారు. అధికారులు మొండిగా ముందుకెళ్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగానికీ వెనకాడబోమని స్పష్టం చేశారు. పోర్టు నిర్మిస్తే అరుదైన జీవరాశులు, జలచరాలు అంతరించిపోయి, ఉపాధికి పెద్దదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం ఏటా లక్షల సంఖ్యలో ఇక్కడికొస్తుంటాయని తెలిపారు. మూలపేట మాజీ సర్పంచి జీరు భీమారావు మాట్లాడుతూ.. ‘‘2015 నుంచి కొద్ది రోజుల ముందు వరకూ భావనపాడు-దేవునల్తాడ మధ్యలో పోర్టు నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మూలపేట వైపే నిర్మిస్తామని ఎందుకు చెబుతున్నారో స్పష్టం చేయాలి. దీని వెనుక మంత్రి సీదిరి అప్పలరాజు హస్తం ఉంది. ఒక సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం మా రెండు గ్రామాలకు అన్యాయం చేయాలనుకుంటే ఊరుకునేది లేదు. భూములను విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లబోం’’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం ఇదేనా..!