రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్ తీసివేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఆయా షిఫ్టు సమయాల్లో విద్యుత్తు ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు కరెంటు కోతల కారణంగా ఉదయం కూడా పనిచేయాల్సి వస్తోంది. పల్లెటూళ్ళలో ఉండి పనిచేస్తున్న వారు ఇన్వర్టర్లు ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.
కొత్త ల్యాప్‌టాప్ కొనాల్సి వచ్చింది..
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ మూడు, నాలుగు గంటలకు మించి రావడం లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో కొత్త ల్యాప్‌టాప్ కొనాల్సి వచ్చింది. కె.రాంబాబు, ఉద్యోగి, మన్యంపార్వతీపురం జిల్లా
మీకే ఇబ్బంది ఎందుకు అని అడుగుతున్నారు
కరెంటు కోతల కారణంగా పూర్తి స్థాయిలో ఆఫీసు పని చేయలేకపోతున్నాం. ఒకసారి అయితే పై అధికారులు వింటారు. ప్రతిసారీ కరెంటు లేదనే సాకు చెబుతుంటే.. తెలంగాణలో లేని ఇబ్బంది మీకే ఎందుకు ఉందని అడుగుతున్నారు.-నాలాది సుధీర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, గురజాల, పల్నాడు జిల్లా