భారత నౌకాదళం రూపొందించిన చక్రాలపై ఆక్సిజన్ సరఫరా పద్దతిని శ్రీకాకుళం జిల్లా పలాస కొవిడ్ కేర్ కేంద్రానికి తూర్పునౌకాదళం సమకూర్చింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట దీన్ని విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ సాంకేతిక సిబ్బంది రూపొందించారు. ఈ టాంకర్ ద్వారా నేరుగా పైపుల్లోకి పంపి రోగులకు అక్సిజన్ అందించే పద్దతిని ఇక్కడ వినియోగించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభ్యర్ధన మేరకు తూర్పునౌకాదళం ఈ ఏర్పాటు చేసింది.
మంత్రి అప్పలరాజు, ఇతర అధికారుల సమక్షంలో నేవీ బృందం.. ఈ ఆక్సిజన్ టాంకర్తో నేరుగా పైపులు అనుసంధానం చేసి అక్కడ ఉన్న 12 మంది కొవిడ్ బాధితులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. నేవీ బృందం ఆసుపత్రి వర్గాలకు ఈ మొబైల్ ప్లాంట్ నిర్వహణ అంశంలోనూ శిక్షణ ఇచ్చింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాకు వీలవుతోంది. దీన్ని.. ఇటీవలే తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ లాంఛనంగా ఆమోదించి, ప్రారంభించారు. క్షేత్ర స్ధాయిలో అవసరాలను బట్టి వీటిని ఉపయోగిస్తారు.