Tekkali YSRCP MLA Candidate: రానున్న శాసనసభ ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య అయిన టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి పోటీ చేస్తారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా టెక్కలి నుంచి మహిళా అభ్యర్థి బరిలో దిగితే బాగుంటుందని పలు దఫాలుగా తాను ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు చెప్పారు.
Duvvada Srinivas Wife Vani: చివరికి అంగీకరించి తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు అంగీకరిచారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధికమెజార్టీతో గెలిపించి, వైసీపీ జెండా ఎగురవేసే విధంగా ఆదరించాలని కోరారు. కొద్ది వారాల క్రితమే దువ్వాడ శ్రీనివాస్ దంపతులు విలేకరుల సమావేశం పెట్టి తమ భార్యాభర్తల మధ్య విభేదాలు లేవని.. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
సీఎంను కలిసిన దువ్వాడ: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు వాణి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. ఆ సమయంలోనే ఈ నిర్ణయం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కూడా సాగింది. దీంతో నేడు దువ్వాడ శ్రీనివాస్.. స్వయంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.