ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఐజీనంటూ ఖాకీలకు బురిడీ... ఎన్నో రోజులు సాగలేదు గారడీ... - నకిలీ డీఐజీ అరెస్ట్

పోలీసులే అతనికి నిఘా... వారికే బురిడీ కొట్టించి వివిధ అకౌంట్లలో డబ్బులు జమ చేయించేవాడు ఆ ఆకతాయి. ఎట్టకేలకు ఆ నేరస్థుడి ఆటలు అటకెక్కించారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు.

dummy dig gets arrested at srikakulam district
నకిలీ డీఐజీ అంటూ మోసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

By

Published : Feb 14, 2020, 9:09 AM IST

నకిలీ డీఐజీ అంటూ మోసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాచపల్లి శ్రీను అనే అనంతపురం జిల్లా వాసి... పోలీసులనే నమ్మించి మోసం చేశాడు. శ్రీను ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. నేరాలు చేస్తూ అడ్డదారిలో నడిచేవాడు. 2006 నుంచి బంగారు ఆభరణాలు అపహరించేవాడు. ఇలా 18 దొంగతనాల కేసుల్లో చిక్కుకున్న శ్రీనుపై నాన్​బెయిలెబుల్ వారెంట్లు ఉన్నాయి. 2017లో ఓ గొలుసు అపహరించి పారిపోయే క్రమంలో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి దొంగతనాలు వదిలేసి... రూటు 'వైట్​కాలర్' నేరాలపైకి మళ్లించాడు.

పోలీసులపై చర్యలు అనే వార్తలు ఆసక్తిగా గమనించేవాడు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారి జాబితా తయారు చేసుకున్నాడు. ఉన్నతాధికారినంటూ ఫోన్​ చేసి హడావుడి చేసేవాడు. 'నాకింత ఇస్తే... నీకు పోస్టింగ్ వేయిస్తా' అని నమ్మించేవాడు. రోడ్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారి బ్యాంకు ఖాతాల నంబర్లు చెప్పి... వారి ఖాతాలోనే డబ్బులు జమచేయమనేవాడు. అలా చేసిన ఓ అధికారికి అనుమానం రావటంతో...తీగ లాగారు. దీంతో అక్రమార్కుని ఆట కట్టింది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి.

పత్రికల్లో పోలీసులపై చర్యలు అనే వార్తలపై దృష్టి పెట్టేవాడు

పోలీస్ ఉద్యోగులు ఎందుకు వీఆర్​లో ఉన్నారు. ఎందుకు సస్పెండ్ అయ్యారు.. క్రిమినల్ కేసులో ఎందుకు ఇరుక్కున్నారనే వివరాలను ఆరా తీసేవాడు. ఇలాంటి వార్తలు పత్రికల్లో ప్రచురితమైతే ఆసక్తిగా పరిశీలించేవాడు. సంబంధిత పోలీస్ స్టేషన్​కు ఫోన్​చేసి రేంజ్ డీఐజీని మాట్లాడుతున్నానని... అధికారుల వివరాలను అడిగి తెలుసుకునేవాడు. కిందిస్థాయి సిబ్బంది ఇతడిని నమ్మి వివరాలు చెప్పేవారు. ఫోన్‌ చేసి వివరాలు అడిగే సమయంలో... అవతలివారు గట్టిగా అడిగితే వెంటనే ఫోన్‌కట్‌ చేసేవాడు. నేరాలకు పాల్పడిన తరువాత సిమ్‌ కార్డు మార్చేస్తాడు. ఉభయ రాష్ట్రాల్లోనూ

శ్రీను వద్ద ఓ పుస్తకం గుర్తించారు పోలీసులు. అందులో ఎవరెవరిని మోసగించాలో పేర్లు రాసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, వరంగల్‌ , జీడిమెట్ల, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, మంగళగిరి, గురజాల, వనస్థలిపురం, విజయవాడ, అమలాపురానికి చెందిన పోలీసులు, హత్య కేసు నిందితులు, ఉపాధ్యాయుల పేర్లు నమోదు చేసుకొన్నాడు. ఏదో ఒక కారణంగా శాఖాపరమైన చర్యలకు గురైన వారిని గుర్తించి తనదైన శైలిలో నమ్మించి తాను చెప్పిన ఖాతాల్లోకి నగదు జమ చేయించుకునేవాడు.

ఆ ఖాతా వివరాలు ఆరా తీస్తే

జేఆర్‌ పురం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ అశోక్‌బాబుకు నెల రోజుల కిందట రాచపల్లి శ్రీను ఫోన్‌ చేశాడు. విశాఖపట్నం డీఐజీనంటూ... ‘మీరు వీఆర్‌లో ఉన్నారు... రూ.4 లక్షలు ఇస్తే మీ సమస్య పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన అశోక్‌బాబు ఆ ఖాతా నంబరుపై ఆరా తీశాడు. అది ఒక పండ్ల వ్యాపారిది.

జేఆర్​పురం పోలీసులు దర్యాప్తులో భాగంగా బ్యాంక్‌ అకౌంట్‌ ఎవరిదని ఆరా తీయగా... మిగతా విషయాలు బయటకు వచ్చాయి. అలా డొంకంతా లాగడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనును గురువారం శ్రీకాకుళం కొత్త బ్రిడ్జి దగ్గర పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి 2 చరవాణీలు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలు చేపడుతున్న వారి పట్ల ప్రజలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అమ్మిరెడ్డి కోరారు. అనంతరం పోలీసులకు రివార్డులను అందజేశారు.

ఇదీ చదవండి:రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం

ABOUT THE AUTHOR

...view details