ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ‘చెరకు’ చిక్కిన కర్షకుడు

చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రూపాయిలు మిగులుతాయని ఆశపడ్డవారికి నిరాశే మిగులుతోంది. కరోనా రక్కసి ప్రభావం వారి జీవితాలపైనా తీవ్రంగా చూపుతోంది. లాక్‌డౌన్‌తో అర్దంతరంగా గానుగ నిలిచిపోగా... పంట పొలాలకే చెరకు పరిమితం అవుతోంది. చేతికొచ్చిన పంట ఎండిపోతోంది.

due to corona Sugarcane farmers problems in srikakulam
due to corona Sugarcane farmers problems in srikakulam

By

Published : Apr 11, 2020, 5:36 PM IST

శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల్లో చెరకు పంట సాగవుతోంది. ఆ రైతులు రేగిడి మండలం సంకిలిలోని చక్కెర పరిశ్రమకు చెరకును తరలిస్తుంటారు. ముందుగానే ప్రణాళిక రూపొందించుకొని గానుగ ఆడటంతో ఇబ్బందులు తలెత్తేవి కావు. ఈ ఏడాది అదే మాదిరిగా ప్రణాళిక సిద్ధం చేసి, గానుగ చేస్తున్నారు. అనుకున్నట్లే జరిగితే మరోవారం రోజుల్లో పూర్తయిపోయేది. ఇంతలో కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టేసింది. లాక్‌డౌన్‌ తప్పనిసరి అయింది. ఫలితంగా సంకిలిలోని చక్కెర కర్మాగారం మూతపడటంతో రైతులకు అవస్థలు మొదలయ్యాయి. చెరకు రైతులు ఎకరాకు 18-23 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పంట ఎండిపోతుండటంతో బరువు తగ్గిపోతోంది. చెరకు పంట ఎంత బరువుంటే రైతుకు అంత ప్రయోజనం. పలు గ్రామాల్లో చెరకు కోతకు సిద్ధంగా ఉంది. గత నెలలోనే ఇది పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం టన్ను ధర రూ.2,750గా ఉంది.

చెరకు ఎండిపోతోంది: రెండెకరాల్లో చెరకు పంట సాగు చేశాను. 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అనుకున్నాను. కర్మాగారానికి తరలించాల్సిన సమయంలో లాక్‌డౌన్‌ సమస్య తలెత్తింది. పంట అంతా ఎండిపోతోంది. పెట్టుబడులు సైతం చేతికి అందుతాయో లేదోననే భయం వేస్తోంది. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి... అంటూ బి.వెంకటరమణ అనే రైతు వాపోతున్నారు.

వారం గడిస్తే పూర్తయ్యేది: పాలకొండ, రాజాం, రేగిడి, సంతకవిటి, పొందూరు, వీరఘట్టం, సీతంపేట, రణస్థలం, లావేరు, నరసన్నపేట, తదితర మండలాల్లో ఇంకా కొంత మేర చెరకు గానుగ ఆడాల్సి ఉంది. మరో వారం గడిస్తే మొత్తం పూర్తయ్యేది. ఇప్పుడు మిగిలిన 25 వేల మెట్రిక్కు టన్నుల గానుగ ఆడాలంటే పది రోజుల సమయం పడుతుందని కర్మాగార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పరిశ్రమ గానుగ ఆడటం మొదలు పెడితే తొలి రోజుల్లో 2 వేలు టన్నులతో ఆరంభమవుతుంది. నాలుగైదు రోజుల్లో 4 వేల టన్నులకు పెరుగుతుంది. ఈ లెక్కన పది రోజుల సమయం అవసరమని చెబుతున్నారు.

తీవ్రంగా నష్టపోతున్నాం: రెండు ఎకరాల్లో చెరకు పంట సాగు చేశాం. ఎకరాకు 30వేలు వరకు పెట్టుబడులు పెట్టాం. తీరా ఇప్పుడు చెరకు కోత చేయలేని పరిస్థితి నెలకొంది. కర్మాగారానికి తరలిస్తేనే డబ్బులు వచ్చేవి. తీవ్రంగా నష్టపోతున్నాం. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదంటూ.. మరో రైతు ఆవేదన చెందుతున్నాడు.

అనుమతి కోరతాం:లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమ మూసివేయమన్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం. పది రోజులు అనుమతి ఇస్తే చాలు మొత్తం చెరకు గానుగ పూర్తవుతుంది. రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. కలెక్టర్‌ను కలిసి కర్మాగారం తెరిచేందుకు అనుమతి కోరతామని... ప్యారీసుగర్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగశేషారెడ్డి అన్నారు.

జిల్లాలో చెరకు సాగు 14,800 ఎకరాలు కాగా గానుగ లక్ష్యం 4.30 లక్షల టన్నులు. కానీ ఇంతవరకు గానుగ ఆడింది 4.05 లక్షల టన్నులు మాత్రమే.ఇంకా 25 వేల టన్నులు గానుగ చేయాల్సి ఉండగా.. 10 రోజులు సమయం పడుతుంది.

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణకు యువకుల కృషి

ABOUT THE AUTHOR

...view details