రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. స్థానికంగా ఉపాధి దొరక్క అధికశాతం ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు.. అభివృద్ధికి దూరంగా.. సమస్యలకు దగ్గరగా జీవనం సాగిస్తున్నారు ఇక్కడ జనం.. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తిస్థాయిలో పరిష్కారం చూపలేకపోతున్నారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు, క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు వేదికగా నిలవాల్సిన డీఆర్సీ (జిల్లా సమీక్ష సమావేశం) కొత్త సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటివరకూ జరగలేదు. ఇతర జిల్లాల్లో ఒకటి రెండుసార్లు జరిగినా ఇక్కడ మాత్రం ఆ ఊసేలేదు.
శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం జరగాల్సి ఉంది. గతంలో సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేసినా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తావన రావడంతో అదికాస్త రద్దయింది. తర్వాత అధికారులు, అటు ప్రజాప్రతినిధులకు ముహూర్తం కుదరకపోవడం గమనార్హం. 2018 ఆగస్టులో అప్పటి కలెక్టర్ ధనుంజయరెడ్డి అధ్యక్షతన జిల్లాలో ఆఖరి డీఆర్సీ జరిగింది. తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ దాని ఊసేలేదు.
జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాల్లో రెండుచోట్ల తెదేపా మిగిలిన చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకరుగా వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ఉన్నారు. కలెక్టర్ అధ్యక్షతన డీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి అన్ని శాఖల ముఖ్య అధికారులు తప్పనిసరిగా హాజరవుతారు. ఒక్కో శాఖ పనితీరు ఎలా ఉందనే ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆరా తీస్తారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రస్తావించవచ్చు. వాటి పరిష్కారాల కోసం వివరణ కోరవచ్చు. అన్ని శాఖలపైనా సమీక్షించేందుకు ఈ వేదిక ఉపయుక్తంగా నిలుస్తుంది.
ఎన్నో సమస్యలు..
జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. టెక్కలి సహా అటువైపు ఉన్న కొన్ని మండలాల రైతులు వేసిన పంటలకు సాగునీరందని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక ఇంకా కొంతమంది రైతన్నలు అవస్థలు పడుతూనే ఉన్నారు. పంట అమ్ముకున్న అన్నదాతకు సొమ్ము కూడా అందని వైనం. మరోపక్క వేసవి వచ్చేసింది. ఎక్కడికక్కడే తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మహిళలు పానీపట్టు యుద్ధాలు చేస్తున్నారు. అనేకచోట్ల రక్షితనీటి పథకాలున్నా పనికిరాకుండా వృథాగా పడిఉన్నాయి.