శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో లాక్డౌన్ ప్రకటించే విషయమై ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇచ్చాపురం మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కొందరు రోగులు నిర్లక్ష్యంతో చివరి నిమిషంలో ఆస్పత్రులకు రావడం వల్ల మృతి చెందుతున్నారని తెలిపారు.
ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతంలో ఉండడం, వలస కూలీలు ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు నమోదు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం.వినోద్ బాబు, తహసీల్దార్ అమల, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.