Dialysis Center Notices: శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజల్ని కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది. దీని బారిన పడి ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకోగా.. వేలాదిమంది బాధితులు రేపోమాపో అన్నట్లుగా ప్రాణాలు అరచేతపట్టుకుని బతుకుతున్నారు. ఈ రోగుల కోసం జిల్లాలో పలుచోట్ల డయాలసిస్ కేంద్రాలు ఇప్పటికే నడుస్తున్నాయి. టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో 2015లో అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది నెఫ్రోప్లస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది.
ఈ సెంటర్కి.. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి 2022, మే నెల నుంచి బకాయిలు పేరుకుపోయాయి. వీటిని ఈనెల 27లోగా చెల్లించకుంటే 28వ తేదీ నుంచి డయాలసిస్ సేవలు నిలిపివేస్తామని నెఫ్రోప్లస్ సంస్థ యాజమాన్యం.. డయాలసిస్ కేంద్రం వద్ద నోటీసులు అతికించింది. దీంతో తమ ప్రాణాలు నిలిచేదెలా అంటూ కిడ్నీ రోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 83 మంది రోగులు.. డయాలసిస్ చేయించుకుంటున్నారు.
టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే మెళియాపుట్టి, సారవకోట, పాతపట్నం మండలాల రోగులకు సైతం ఈ కేంద్రమే ఆధారం. వ్యాధిబారిన పడినవారు వారానికి రెండుమూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. రోగికి తోడుగా వారి కుటుంబ సభ్యులు కూడా వస్తుండటంతో ఆసుపత్రి నిత్యం కిడ్నీ రోగులతో కిటకిటలాడుతోంది. ప్రతి రోగికి ఒకసారి డయాలసిస్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.1,055 చెల్లిస్తోంది.
ఇందులో నెఫ్రోప్లస్ సంస్థకు రూ.821, ఆసుపత్రికి.. నిర్వహణ ఖర్చులకింద రూ.234 చెల్లించాలి. మొత్తంగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని ఈ కేంద్రానికి.. ప్రభుత్వం రూ.1.20 కోట్ల వరకు బకాయి పడింది. ఇక్కడ తొమ్మిదిమంది ఉద్యోగులున్నారు. వారు కూడా ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఈకేంద్రం ఒక్కరోజు మూతపడినా ఎంతోమంది ప్రాణాలు పోయే ప్రమాదముందని కిడ్నీ రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.