సిక్కోలు ఏకైక మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రమాణస్వీకారం - minister
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఈయనతోనే మొదలైంది.
ధర్మాన కృష్ణందాస్ అనే నేను
రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. సిక్కోలు జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్...ఆయనతో ప్రమాణం చేయించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే పలువురు నేతలు ఉన్నారు. ఆయనకు అండగా నిలిచారు. వారిలో ధర్మాన కృష్ణదాస్ ఒకరు. వైకాపాను స్థాపించక ముందు నుంచీ జగన్‌కు చేరువగా ఉన్నారు. 2012 ఉపఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలిచారు.జిల్లా వైకాపా అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహించారు. సీనియర్ అయినప్పటికీ.. ఎక్కడా స్థాయి దాటి దర్పాన్ని ప్రదర్శించకపోవడం కూడా కృష్ణదాస్‌కు కలిసొచ్చిందని చెబుతున్నారు. జిల్లా వరకు కృష్ణదాస్‌కు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన జగన్‌మోహన్ రెడ్ఢి. ఆయన చేసే సూచనలను గౌరవిస్తూ వచ్చారు. శాసనసభ సభ్యత్వాన్ని సైతం త్యాగం చేసి.. కష్టకాలంలో వెన్నంటి నిలిచారు.
అప్పుడు.. ఇప్పుడు...
నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారిలో ధర్మాన సోదరులే రాష్ట్ర మంత్రి వర్గంలో చేరిన ఘనత దక్కించుకున్నారు. 1991లో రాష్ట్ర మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావు చేరి వరుసగా పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అనంతరం మళ్లీ ఇపుడు మరో పర్యాయం ధర్మాన కుటుంబాన్ని మంత్రి పదవి వరించింది. దాదాపు 26 ఏళ్ల అనంతరం మళ్లీ నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కుటుంబానికి చెందిన కృష్ణదాస్‌కు మంత్రి వర్గంలో చోటు లభించింది.