ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధనుర్మాస చిక్కీలు.. నెలరోజులే లభ్యం.. ఎక్కడో తెలుసా? - ఏపీ తాజా వార్తలు

DHANURMASA CHIKKILU IN SRIKAKULAM : ప్రతి ప్రాంతానికి దాని ప్రత్యేకతను చాటిచెప్పే వంటకం.. ఒకటుంటుంది. పూతరేకులు, మడత కాజాలంటే.. గోదావరి జిల్లాలు ఠక్కున మదిలో మెదుల్తాయి. రాగి సంకటంటే సీమ గుర్తుకొస్తుంది. అలానే ఉత్తరాంధ్ర ప్రత్యేకతను చాటిచెప్పే వంటకం ఒకటుంది. కేవలం ధనుర్మాసంలో మాత్రమే తయారయ్యే ఆ స్వీటుకు.. ఉత్తరాంధ్ర వాసులు ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆ స్వీటు లేనిదే పెళ్లిళ్లలో సారె ఉండదు. పూరీ జగన్నాథుడికి కూడా నైవేద్యంగా అందించే ఆ వంటకం ప్రత్యేకత గురించి.. మనమూ తెలుసుకుందాం.

DHANURMASA CHIKKILU
DHANURMASA CHIKKILU

By

Published : Jan 11, 2023, 6:23 AM IST

నెలరోజులు మాత్రమే దొరికే ధనుర్మాస చిక్కీలు.. ఎక్కడో తెలుసా?

DHANURMASA CHIKKILU : ధనుర్మాస చిక్కీలు పేరు వినగానే ఉత్తరాంధ్ర ప్రజలు లొట్టలేసుకుంటారు. ఏడాదిలో నెలన్నర మాత్రమే లభ్యమయ్యే ఈ ధనుర్మాస చిక్కీల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఏడాది అంతా ఎదురు చూస్తుంటారు. ఉత్తరాంధ్రలో ఎవరింట్లో పెళ్లి జరిగినా పెళ్లికూతురికి పెట్టే సారెలో ధనుర్మాస చిక్కీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టే ఈ ధనుర్మాస చిక్కీల ప్రత్యేకతను తెలుసుకుందాం.

ఏళ్ల క్రితం ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చి స్థిరపడిన వారు ఈ చిక్కీలను తయారుచేసి విక్రయించేవారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నవారు సైతం దీనిని తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. కేవలం ధనుర్మాసంలో మాత్రమే తయారయ్యే వంటకం కాబట్టి దీనిని ధనుర్మాస చిక్కీలు అంటారు. అలా తయారైన ఈ చిక్కీల విక్రయం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తరించింది. పెళ్లిళ్లలో పెట్టే సారెలో కచ్చితంగా ఈ చిక్కీలు ఉండాల్సిందే.

"గత 60 సంవత్సరాల నుంచి మేము వీటిని తయారుచేస్తున్నాం. ఇది మా కులవృత్తి . దీనిని కేవలం ధనుర్మాసంలోనే తయారుచేస్తాం. దీని ప్రత్యేకత ఏంటంటే చలికాలంలో బిగువుగా ఉంటుంది. ఎండాకాలంలో ఉండదు. ఈ చిక్కీలు ఎంత బిగువుగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. పంచదార, సుగంధ ద్రవ్యాలు వేసి వీటిని తయారు చేస్తాం. అందంగా కనిపించడానికి జీడిపప్పు, చెర్రీలు అలంకరిస్తాం"-గుడియా ఈశ్వర్‌సాహో, చిక్కి తయారీదారు

పంట కోతలు పూర్తయిన తర్వాత కొత్త ధాన్యాన్ని దంచి తయారు చేసిన పేలాలకు పంచదార పాకం కలిపి.. వేర్వేరు ఆకృతుల్లో వీటిని తయారు చేస్తారు. ఇందులో మంచి పోషకాలుంటాయి.. అంతేగాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. సంక్రాంతి పర్వదినం కావున ఇంటికొచ్చిన ఆడపడుచులకు, పెళ్లైన ఆడపిల్లలకు వీటిని సారెగా, స్నేహితులు ,ఇంటి చుట్టుపక్కల వాళ్లు వాయనంగా ఇస్తారు. ఈ నెలంతా ఆడవాళ్లు వీటి తయారీ నుంచి ఉపాధి పొందుతారు.పెళ్లయిన ఆడ పిల్లలను పండగకి పుట్టింటికి పిలవటానికి వెళ్లినప్పుడు ఇవి ఇచ్చి ఆహ్వానిస్తారు. స్నేహితులు, ఆత్మీయులు వీటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని అందులోని పంచదార, పేలాలు ఎలా కలిసి ఉంటాయో.. అలానే అందరూ కలిసి ఉండాలని ఆశిస్తారు.

"మా పురాతన కాలం నుంచి పూరి జగన్నాథ స్వామికి తొలి ప్రసాదంగా సమర్పిస్తాం. ఇది దేవుడికి చాలా ప్రీతికరమైనది. విశాఖ, విజయనగరం పలు ప్రాంతాలకు దీనిని సరఫరా చేస్తాం. అమెరికాకు కూడా వీటిని సరఫరా చేస్తున్నాం. రోజు సుమారు 300 కేజీల చిక్కీలు తయారుచేస్తాం"-గుడియా ఈశ్వర్‌సాహో, చిక్కి తయారీదారు

దేశంలోనే ప్రముఖ దేవాలయమైన పూరి జగన్నాథస్వామికి ఈ స్వీటును నైవేద్యంగా సమర్పిస్తారు. ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోన్న ఈ ఆచారం ఇప్పటికీ యథావిధిగా సాగుతోంది. అలాగే అమెరికాకు సైతం ఎగుమతి చేసే వరకూ వెళ్లింది. కేవలం ధనుర్మాసంలో మాత్రమే ఈ స్వీటు తయారీ ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడా దొరకదని చెబుతున్నారు స్థానికులు. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాలకు ఈ చిక్కీలను పరిచయం చేయాలని భావిస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details