రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే స్థాయి జనసేన అధినేత పవన్‌కు లేదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలోనూ పవన్ గెలవలేక పోయారని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయాల గురించి మాట్లాడకుండా సినిమాలు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
"పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన మంచి నాయకుడు. ఆయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉంటేనే బాగుంటుంది. వ్యక్తిగతంగా పవన్ అంటే నాకూ ఇష్టమే. చక్కగా ఫైట్ చేస్తాడు, డైలాగులు చెబుతాడు. కానీ..రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సీఎం జగన్‌తో పోల్చుకోవద్దని ఓ శ్రేయోభిలాషిగా పవన్‌ను కోరుతున్నా. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదు. జగన్‌కు జగనే సాటి. రాష్ట్ర ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందనేది నా హితవు."-ధర్మాన కృష్ణదాస్, ఉపముఖ్యమంత్రి