శ్రీకాకుళం జిల్లాలో 'గులాబ్' తుపాను తీరం దాటిందని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాకు ఎక్కువ నష్టం వాటిల్లలేదని లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. తుపాను ప్రభావానికి పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిందన్న కలెక్టర్.. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గులాబ్.. సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందన్న కలెక్టర్.. అయినప్పటికీ తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.