ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పునీటితో నిస్సారమవుతున్న బీల భూములు - శ్రీకాకుళం తాజా వార్తలు

ఇటు రొయ్యల చెరువుల వ్యర్థాలు, అటు చొచ్చుకొస్తున్న సముద్రపు ఉప్పునీరు.. వెరసి నిస్సారమవుతున్న వేలాది ఎకరాల్లోని పంటపొలాలు.. ఊటనీటితో సిరులు పండించే బీల భూములు కళ్లముందే కాఠిన్యంగా మారుతుంటే సగటు రైతు విలవిల్లాడుతున్నాడు. బీలబట్టీని ఆధునీకరించే పనులూ సగంలోనే ఆగిపోవడం మరో ఇబ్బందికర పరిణామం. మూడు మండలాల్లోని బీల రైతులు కన్నీటి కథలోకెళితే..

Cultivation probles due to salt water in srikakulam
ఉప్పునీటితో నిస్సారమవుతున్న బీలభూములు

By

Published : Oct 4, 2020, 2:26 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి మండలాల పరిధిలో 20 వేల ఎకరాల మేర పంటపొలాలు బీల ఆధారంగా సాగవుతున్నాయి. మహేంద్రగిరుల నుంచి వచ్చే వరద నీరు సోంపేట మండలం కంబప్రాంతంలో బీలలో చేరుతుంది. అక్కడ నుంచి 18 కి.మీ. పొడవునా కవిటి మండలం ఇద్దివానిపాలెం వరకు బీలబట్టి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రవాహం మేర పొలాల్లో ఏటా రెండు పంటలు పండుతాయి. ఈ పొలాలు ప్రస్తుతం రెండు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కవిటి మండలం బల్లిపుట్టుగ, మాణిక్యపురం, కుసుంపురం పరిధిలో రొయ్యల చెరువులసాగుతో ఉప్పునీటితో పాటు ఇతర వ్యర్థాలు విడిచిపెడుతుండడం మొదటిది కాగా.. ఒంటూరు, ఇద్దివానిపాలెం వద్ద షట్టర్లు నిర్మించకపోవడంతో సముద్రజలాలు బీలలో చేరుతుండడం రెండోది. ఈ నేపథ్యంలో కవిటి, కంచిలి, సోంపేట మండలాల పరిధిలో ఐదువేల ఎకరాల బీలభూములు చౌడుతేలి ఇప్పటికే నిస్సారమయ్యాయి. ఐదేళ్లుగా ఈ పొలాల్లో నాట్లు వేస్తున్నా పంట రావడంలేదు. దీంతో ఈ ఏడాది సగం భూముల్లో నాట్లే వేయకుండా మానుకున్నారు రైతులు.

పెద్దబీలను తాకిన ఉప్పుసెగ

వరదనీటితో ఐదేసి వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చిన్నబీల, పెద్దబీల ప్రాంతాల్లో సహజసిద్ధ జలాశయాలున్నాయి. మాణిక్యపురం-రుషికుద్ద, గొల్లగండి-కుత్తుమ- ఇసకలపాలెంల మధ్యభాగంలో ఏర్పడిన రెండు జలాశయాల్లో ఏడాది పొడవునా నీటినిల్వలుంటాయి. వీటిని అనుసంధానిస్తూ మూడు మండలాల పరిధిలో బీలబట్టి ప్రహహిస్తుంది. వీటి ఆధారంగానే కవిటి ఉద్దానంలో 32 వేల ఎకరాల కొబ్బరి, ఇతర ఉద్యానపంటలు, 20 వేల ఎకరాల పంటపొలాలు, 1.50 లక్షల మందికి మంచినీటి సదుపాయం అందుతుంది. బెంకిలి, రుషికుద్ద, కుత్తుమ ఎత్తిపోతల పథకాలు బీల ఆధారంగానే పనిచేస్తున్నాయి. వెయ్యి మత్స్యకార కుటుంబాలు బీల ప్రాంతాల్లో చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.

అటకెక్కిన అభివృద్ధి

2016లో ఉపాధిహామీలో భాగంగా 7 కి.మీ.మేర బీలబట్టీలో పూడికతీసి కరకట్టలు బాగుచేశారు. మిగిలిన పనులను పట్టించుకోలేదు. వరదనీరు చేరే బారువ కంబప్రాంతం నుంచి ఇద్దివానిపాలెం వరకు కి.మీ.కు రెండు అడుగుల లోతు పెంచి నీటినిల్వ ఉండేలా 30 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతున పనులు చేసేందుకు వీలుగా చేపట్టిన ప్రతిపాదనలు అమలుచేస్తే సాగు, తాగునీటి సమస్యలతో పాటు ఉప్పునీటి ఇబ్బందులు పరిష్కారమవుతాయి. నాలుగుచోట్ల షట్టర్లు, సిమెంట్‌ నిర్మాణాలు చేపడితే బీలను కాపాడుకునే వీలుంది.

సాగుకి దూరమయ్యాం

బీల రూపురేఖలు మారిపోయాయి. నీటిలభ్యత ఉన్నా ఉప్పునీరు కావడంతో వరిసాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో కేవలం చిన్నబీలకు మాత్రమే పరిమితమైన ఇబ్బందులు బీలబట్టి ద్వారా పెద్దబీల భూములకు తాకింది. ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో నిలిచిన ఉప్పునీరు సముద్రంలో కలిసే పరిస్థితి లేక నాట్లు వేయలేదు. బీలబట్టి ఆధునికీరణతోనే ఇబ్బందులు పరిష్కారమవుతాయి.- సంది బాలరాజు, బీలరైతు, రుషికుద్ద

బీలబట్టి అభివృద్ధికి చర్యలు

బీలబట్టి ఆధునికీకరణ విషయమై మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడతాను. బారువ కంబ నుంచి ఇద్దివానిపాలెం వరకు బీలబట్టి ఆధునికీకరణ పనులు చేస్తే మూడు మండలాల సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారంతో పాటు వరద ముంపు నుంచి పంటపొలాలకు రక్షణ ఏర్పడుతుంది. -పిరియా సాయిరాజ్‌ ఛైౖర్మన్‌, డీసీఎంఎస్‌, శ్రీకాకుళం

ఇదీ చదవండి:

ఊళ్లకు నిధులు.. ఇళ్లకు నీళ్లు!

ABOUT THE AUTHOR

...view details