కొవిడ్ మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 9, 10వ తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమయ్యింది. పిల్లలు పాఠశాలలకు చేరగానే వారికి థర్మల్ పరీక్షలతో పాటు చేతులను శానిటైజ్ చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం వీడటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలలు ప్రారంభం కాకముందే.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయించారు. పాజిటివ్ వచ్చిన 54 మంది ఉపాధ్యాయులు స్కూల్‌కు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని డీఈవో అన్నారు. బడికి వస్తున్న పిల్లల్లో ఇప్పటివరకు వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. పాఠశాలల్లో పర్యవేక్షణకు విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని..దాని ద్వారా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.