శ్రీకాకుళం జిల్లా గార మండలం లంకపేట గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు సురాని వెంకటరావుకు కరోనా సోకింది. ఆయనను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత నెల 19న చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 23వ తేదీన వెంకటరావును జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు అధికారులు. అప్పటినుంచి వెంకటరావు కుటుంబ సభ్యులు జెమ్స్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తూనే ఉన్నారు. వెంకటరావు బాగానే ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు చెబుతూ వచ్చారు.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం...తండ్రి కడచూపు దూరం - Corona victims are dying .. Hospital staff did not give proper information
శ్రీకాకుళం జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం... ఓ కొడుక్కి తండ్రి చివరి చూపు దక్కకుండా చేసింది. కరోనాతో చికిత్స పొందుతున్న తండ్రి సమాచారం కోసం ఆసుపత్రి చుట్టూ ఐదు రోజులుగా తిరుగుతున్నా...ఏ ఒక్కరూ స్పందించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చివరకు ఆసుపత్రి వద్ద ఉన్న గుర్తు తెలియని మృతదేహాల ఫొటోల్లో తండ్రి ఫొటో చూసి మృతుడి కుమారుడు బోరున విలపించారు. తన తండ్రి ఈ నెల 2వ తేదీనే మరణించారని, 10వ తేదీన ఆయనకు అంత్యక్రియలు చేశామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది చేతులు దులుపుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈనెల తొమ్మిదో తేదీ నుంచి వెంకటరావు ఆరోగ్య సమాచారం అందించడం లేదని ఆయన కుమారుడు నూకరాజు తెలిపారు. తండ్రి గురించి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ ఎటువంటి సమాచారం లేదన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఆసుపత్రి వద్దనున్న గుర్తు తెలియని మృతదేహల ఫొటోల్లో తన తండ్రి ఫొటోను చూసి నూకరాజు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నెల రెండో తేదీనే తన తండ్రి మృతి చెందారని తెలిసి బోరున విలపించారు. ఆసుపత్రి చుట్టూ ఐదు రోజులుగా తిరుగుతున్నా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. చివరకు 10వ తేదీన అంత్యక్రియలు చేశారని చెప్పారన్నారు. తన తండ్రి చివరి చూపు కూడా దక్కలేదని నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... యువకుడికి తీవ్రగాయాలు