సినిమా రంగంపై కరోనా తీవ్ర ప్రభావమే చూపింది. ముఖ్యంగా థియేటర్లు మూతపడటంతో వాటినే నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల కొత్త చిత్రాలన్నీ ఓటీటీలలో విడుదల అవుతుండటంతో వారి ఆందోళన మరింత పెరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో 50కి పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. వీటి వల్ల సుమారు వెయ్యి మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా.. వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కరోనా రాకతో మార్చి 20వ తేదీన మూతపడిన థియేటర్లు ఇంతవరకూ తెరుచుకోలేదు. ప్రస్తుతం ఓటీటీల్లోనే కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది.
అర్థిక భారం... అగమ్య గోచరం
థియేటర్ల యాజమాన్యాలపై నిర్వహణ భారం పడింది. తెరపై బొమ్మ పడకపోయినా విద్యుత్తు చార్జీలు తప్పవు. కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించలేని పరిస్థితి. జీతంలో కోత పడటంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రొజెక్టరు ఆపరేటర్లు, టిక్కెట్ గుమాస్తాలు, వాహనాల పార్కింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కాపలాదారులు ఇలా అందరికీ సాయం అందించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై పడింది. దీనికితోడు థియేటర్ నిర్వహణ, ఇతరత్రా వ్యయాలూ ముంచుతున్నాయని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వచ్చే నెలలో తెరిచేందుకు అనుమతి ఇచ్చినా థియేటర్లకు ఎంతమంది వస్తారన్నది ప్రశ్నార్థకమే.