శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ విజృంభణతో ఇంటికి చేరుకున్న వలస గంగపుత్రులు మళ్లీ తిరిగి వెళ్లడానికి సాహసించడం లేదు. మరోవైపు సొంత ఊరిలో ఉపాధి లభించకపోవటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని 193 కిలోమీటర్ల సముద్రతీరంలో 172 మత్స్యకార గ్రామాలున్నాయి. అందులో సుమారు 30 వేల మంది వరకు వలస జీవులే. కరోనా దెబ్బకు దాదాపుగా 23 వేల మంది ఆర్నెల్లుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. గతంలో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, కేరళ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తుంటారు. లాక్‌డౌన్ సడలించినా పూర్తిగా రవాణా సదుపాయాల్లేక, లాక్‌డౌన్ సమయంలో ఊరిగానిఊరులో పడిన ఇబ్బందులను తలుచుకుని ఇక్కడే ఉండిపోయారు. స్థానికంగా కుటుంబ పోషణ జరగక, అలాగని బయటి రాష్ట్రాలకు వెళ్లలేక బతుకు భారంగా వెళ్లదీస్తున్నారు.
ఊరు దాటితేనే ఉపాధి
సోంపేట మండలం చేపల గొల్లగండి గ్రామంలో 257 మత్స్యకార కుటుంబాలుంటే 150 కుటుంబాలు గోవా, పారాదీప్, చెన్నై, అండమాన్ దీవులకు వెళ్లేవారు. కరోనాతో అతికష్టం మీద అంతా సొంతూళ్లకు వచ్చేశారు. ఇక్కడ చేతి నిండా పని లేక ఇబ్బంది పడుతున్నారు. బయటి రాష్ట్రాలకు వెళ్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు స్థానికులు. వారం, పది రోజులు సముద్రంలో వేట సాగించినా మూడు, నాలుగు రోజులు హార్బర్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. స్టీమర్, మరపడవల యాజమానులే భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారని వివరించారు.