శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో వైకాపా వర్గీయులు తమపై అన్యాయంగా దాడి చేశారంటూ రజకులు రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బన్నువాడలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు... బట్టలు ఉతకమని రజకులను కోరగా వారు తిరస్కరించారు. దుస్తులు ఉతకలేమని, తమకు ధర గిట్టుబాటుకావడం లేదని చెప్పడంతో వివాదం తలెత్తింది.
రజకుల కుల పెద్దగా వ్యవహరించే వ్యక్తి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి సమీక్ష నిర్వహించారు. చర్చ వేళ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలోనే వైకాపా వర్గీయులు.. కులపెద్ద ఇంట్లోకి చొరబడి దాడి చేశారని రజక వర్గం ఆందోళన చేపట్టింది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమపై అక్రమ కేసులు పెట్టారని రజక వర్గం టెక్కలి పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.