ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan: చదువుపై పెట్టే ప్రతి పైసా పవిత్ర పెట్టుబడి: జగన్​ - విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరన్న జగన్​

CM Jagan Srikakulam Tour: విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధన పెట్టామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీపడాలంటే కచ్చితంగా పాఠశాలకు వచ్చి పాఠాలు వినాల్సిందేనన్నారు. శ్రీకాకుళంలో అమ్మఒడి మూడోవిడత నిధులు రూ. 6వేల 595 కోట్లను జగన్ విడుదల చేశారు.

CM Jagan released amma vodi funds in srikakulam
ఆ శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌

By

Published : Jun 27, 2022, 12:49 PM IST

Updated : Jun 28, 2022, 4:03 AM IST

Jagananna Amma Vodi Founds: ఏ ప్రభుత్వమైనా చదువు మీద పెట్టే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి, కుటుంబం, సమాజం, దేశం తలరాతను, భవిష్యత్తును మార్చగలిగే శక్తి చదువుకే ఉందని, పిల్లలకి మనమిచ్చే ఆస్తి అది మాత్రమేనని అన్నారు. పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్్సను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని వివరించారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమ్మఒడి మూడో విడత నిధుల్ని జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘అమ్మఒడికి అర్హులవ్వాలంటే విద్యార్థి హాజరు కనీసం 75 శాతం ఉండాలని జీవోలోనే చెప్పాం. మొదటి ఏడాదే ఈ నిబంధన అమలు చేయడం సరికాదని భావించాం. రెండో ఏడాది కొవిడ్‌ కారణంగా సడలింపు ఇచ్చాం. గతేడాది సెప్టెంబరు నుంచి పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తున్నందున ఈసారి నిబంధనను అమలు చేశాం. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 51 వేల మంది తల్లులకు సహాయం అందకపోవడం బాధాకరమ’ని సీఎం అన్నారు. పిల్లల హాజరు 75 శాతం కంటే ఎక్కువ ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కేవలం అమ్మఒడి కిందే రూ.19,618 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు.

అందుకే రూ.2 వేల మినహాయింపు..

‘పాఠశాలల్లో పరిసరాలు, మూత్రశాలలు బాగుంటేనే పిల్లలు మంచి వాతావరణంలో చదువుకోగలుగుతారు. దీనికోసం టాయిలెట్‌ నిర్వహణ నిధి (టీఎంఎఫ్‌) కింద ప్రతి తల్లి అందుకున్న సాయం నుంచి రూ.వెయ్యి చొప్పున కేటాయిస్తున్నాం. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు మార్చినప్పటికీ, ఎప్పటికప్పుడు చిన్నచిన్న మరమ్మతులు చేసుకుంటేనే బాగుంటాయి. అందుకే పాఠశాల నిర్వహణ నిధి (ఎస్‌ఎంఎఫ్‌) కింద మరో రూ.వెయ్యి మినహాయిస్తున్నాం. పాఠశాలల్లో పరిస్థితులు బాగాలేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడానికి ఈ విధంగా ఆస్కారం కలుగుతుంది’ అని సీఎం వివరించారు. ఒక దేశం తలసరి ఆదాయం బాగుందంటే కారణం.. అక్కడి పిల్లలకు నాణ్యమైన విద్య అందడమేనని, అందుకే సాంకేతిక విద్యనందిస్తున్న బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామని జగన్‌ తెలిపారు. ‘సంవత్సరానికి రూ.25 వేల ఖర్చుతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న చదువులను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా చెప్పించబోతున్నాం. ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో చేరిన 4.8 లక్షల మంది విద్యార్థులకు వచ్చే సెప్టెంబరులో రూ.12 వేల విలువ చేసే ట్యాబ్‌లు ఇవ్వబోతున్నాం. ఇందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్‌ బోర్డు లేదా టీవీ ఏర్పాటుచేసి, నాణ్యమైన బోధన సాగేలా చూస్తున్నామ’ని వివరించారు.

నా వెంట్రుక కూడా పీకలేరు..

‘మారీచులు వంటి చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు, ఛానెళ్లతో యుద్ధం చేస్తున్నాను. వీరికి ఒక దత్తపుత్రుడు తోడయ్యాడు. ప్రజల ఆశీస్సులు, దయ ఉన్నంతకాలం ఇలాంటి వారు ఎందరు కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు. అమ్మఒడి నిధుల నుంచి రూ.2 వేల చొప్పున మినహాయించడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వారి హయాంలో ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకురాలేకపోయారని అడుగుతున్నా. వాళ్లు పెట్టిన బకాయిలు కూడా మేం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. వాళ్లెవరూ నాకు తోడుగా లేకపోవచ్చు. కాని ప్రజల మీద నమ్మకం ఉంది. వాళ్ల దుష్ప్రచారాన్ని నమ్మకండి. మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందా, లేదా అనేది ఆలోచించండి. దాన్నే కొలబద్దగా తీసుకోండి. తర్వాతే నాకు మద్దతివ్వండి’ అని జగన్‌ కోరారు. ప్రసంగం అనంతరం బటన్‌ నొక్కి అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ సహా పలువురు వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

‘‘ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. ‘జగనన్న అమ్మఒడి’ అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో జమ చేస్తున్నాం. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్నాం. 40లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నాం. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశాం’’ - వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Jun 28, 2022, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details