CM JAGAN TOUR IN NARASANNAPETA : రాష్ట్రంలో ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను సరిచేసి అన్ని రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో జగన్ పాల్గొని.. లబ్ధిదారులకు పత్రాలు అందించారు. రాష్ట్రంలోని భూములన్నింటిని కొలతలు వేసే కార్యక్రమమిది అని.. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తున్నామన్నారు. అన్ని రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం.. ఇకపై భూములు ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుందని తెలిపారు. రైతుల భాగస్వామ్యం, సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే జరుగుతోందని.. మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతాయన్నారు.
"ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో భూములు ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతాయి. రైతుల భాగస్వామ్యం, సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా నిర్ణయం తీసుకున్నాం"-సీఎం జగన్