ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ కల్లా తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం చెబుతున్నందున ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ నెల 26న ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో తుపాను తలెత్తడంతో పాటు, తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదమున్నట్లు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజారోగ్యంపై ఇప్పుడు నీళ్లు, దోమలు, గాలిద్వారా సంక్రమించే రోగాలు మరిన్ని సవాళ్లు విసిరేలా ఉన్నాయని హెచ్చరించారు. అందువల్ల అత్యవసర మందులను నిల్వచేసుకోవాలని.. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షం
గుంటూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా వర్షం పడింది. గుంటూరు, నరసరావుపేట, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, అమృతలూరు, వట్టిచెరుకూరు, నాదెండ్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, వేమూరు, దుగ్గిరాల, రాజధాని అమరావతి ప్రాంతాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. అప్పలరాజుపేటలో వరి పనలు నీట మునిగాయి. ధాన్యం రాశులు ముద్దయ్యాయి. వట్టిగెడ్డ జలాశయ పొర్లు కాలువ వరద నీటితో జోరుగా ప్రవహించింది.శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని హెచ్చరించింది.
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఒకరి మృతి
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో పిడుగుపాటుకు గురై తిప్పన ప్రశాంత్(26) అనే యువకుడు మృతిచెందాడు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు చేసిన సూచనలు