ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jeedi Farmers Problems: జీడి రైతు గుర్తున్నాడా.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ముఖ్యమంత్రి గారూ..? - జీడి పంటకు మద్దతు ధర

జీడి రైతు గుర్తున్నాడా.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ముఖ్యమంత్రి గారూ..?: జీడి పంటకు మద్దతు ధర ఇప్పించేందుకు తపించాలని ప్రతిపక్షంలో ఉండగా గొప్పగా చెప్పారు. దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. అన్నింటిలానే ఈ హామీని కూడా జగన్‌ గాలికొదిలేశారు. పిక్క ధరలు 15 వేల నుంచి 7 వేలకు పతనమై.. 3.33 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతుల పరిస్థితి గందరగోళంగా మారినా కనీస స్పందన లేదు. నష్టాలు భరించలేక రాష్ట్రంలోని 550 పరిశ్రమలను మూసేయాలని యాజమాన్యాలు నిర్ణయించినా, 30 వేల మంది కార్మికుల ఉపాధికి గండిపడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం సీఎంకే సాధ్యమైంది.

Cashew Farmers Problems
Cashew Farmers Problems

By

Published : Jul 7, 2023, 7:19 AM IST

జీడి రైతు గుర్తున్నాడా.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ముఖ్యమంత్రి గారూ..?

Cashew Farmers Problems: ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు తపించాలని, దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఆరాటపడాలని.. ప్రతిపక్ష నేతగా 2019 జనవరి 9న పలాసలో జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉద్దానంలో పండే జీడిపప్పును కిలో 650కి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉంటే.. చంద్రబాబు హెరిటేజ్‌ దుకాణాల్లో పొట్లాల్లో పెట్టి కిలో 11వందల 20 చొప్పున అమ్ముతూ దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చాక జీడి రైతుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు. పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు తీరు అంతే. జీడిపిక్కల ధర బస్తా 14 వేల నుంచి 8 వేలకు పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని, రోజువారీ పనులు కూడా లేక కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. 2020 జూన్‌ 16న ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ప్రభువులు సానుకూలంగా స్పందించి కనీస మద్దతు ధర 14 వేలుగా ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. బస్తాకు వెయ్యి చొప్పున అదనంగా ఇస్తామని 2021లో హామీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత గాలికొదిలేశారు.

ప్రభువుల స్పందన లేదు.. అప్పలరాజూ రాలేదు: అధికారం కోసం జీడి రైతులకు ఎన్నో హామీలిచ్చిన జగన్‌.. తీరా సీఎం అయ్యాక వాటిని పట్టించుకోవడమే లేదు. గతంలో 15 వేల వరకు పలికిన 80 కిలోల జీడిపిక్కల బస్తాకు.. ఇప్పుడు 7 వేలు దక్కకపోయినా స్పందించడం లేదు. అమ్మకాలు మందగించి పరిశ్రమలు మూత పడుతున్నా, లక్షల కుటుంబాలకు జీవనోపాధి దూరమవుతున్నా.. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మూడు సంవత్సరాల కిందట కంటితుడుపుగా లేఖ రాసి, రెండేళ్ల కిందట మొక్కుబడి హామీ ఇచ్చిన అప్పలరాజు.. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టినా జీడి రైతులకు ఒరిగింది శూన్యం.

ALSO READ:కష్టాల్లో పలాస జీడి పరిశ్రమ

పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో.. 1.86 లక్షల మంది రైతులు 3.33 లక్షల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు చేస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతుండటం, విదేశీ జీడిపిక్కల దిగుమతితో ధరలు పతనమై... కొంతకాలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సగటున బస్తాకు 16 వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఆ మేరకు ఇప్పించాలని కోరుతున్నారు. కానీ ప్రస్తుతం 7 వేలు కూడా దక్కడం లేదు. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా.. ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎకరాకు 12 వేల నుంచి 15 వేల వరకు నష్టపోతున్నారు. రాష్ట్రంలో వేసవిలోనే పంట చేతికి వస్తుంది. తర్వాత ఏడాది పొడవునా వివిధ దేశాల నుంచి జీడిపిక్కలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. విదేశాల నుంచి తక్కువ ధరకే వస్తుండటంతో తమకిచ్చే ధరల్లో కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.

నష్టాలు భరించలేక.. మూసివేత దిశగా: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 550 పైగా జీడిపప్పు తయారీ పరిశ్రమలుంటే.. శ్రీకాకుళం జిల్లాలోనే 450కి పైగా ఉన్నాయి. పలాస - కాశీబుగ్గలోని పారిశ్రామికవాడ, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 350కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 వేల బస్తాల జీడిపిక్కల నుంచి 100 టన్నుల వరకు పప్పు ఉత్పత్తి చేస్తున్నారు. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షా 25వేల మంది ఉపాధి పొందుతున్నారు. గతంతో పోలిస్తే పరిశ్రమల నిర్వహణ, విద్యుత్తు ఛార్జీలు, రవాణా వ్యయం భారీగా పెరిగాయి. మార్చి వరకు ధరలు బాగానే ఉన్నా.. ఏప్రిల్‌ నుంచి పతనం మొదలైంది. జీడిపప్పు ధర సగటున కిలోకు 100కు పైగా తగ్గింది. నష్టాలు భరించలేమంటూ పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. పలాసలో బుధవారం నుంచి నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించారు. దీనివల్ల 200 కోట్ల విలువైన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ALSO READ:జీడి మామిడి.. నష్టాలతో రైతుల కంటతడి!

అనధికారిక దిగుమతులతో పడిపోతున్న ధర: ఏటా వివిధ దేశాల నుంచి నౌకాశ్రయాల ద్వారా జీడిపొట్టు దిగుమతి చేసుకుని.. చర్మశుద్ధి కర్మాగారాలు, రంగులు, గుట్కా తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తారు. కొంతకాలంగా జీడిపొట్టు పేరుతో భారీ ఎత్తున జీడిపప్పు అనధికారికంగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి. కేరళ, మంగళూరు నుంచి జీడిపప్పు విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆర్థిక మాంద్యంతో పప్పు వినియోగం తగ్గడంతో... కొంతకాలంగా ఎగుమతులు మందగించాయి. అందువల్ల ఆ నిల్వలు దేశీయ మార్కెట్‌కు వెల్లువెత్తడం, ఆషాఢం నేపథ్యంలో శుభకార్యాల్లేక వినియోగం తగ్గడం కూడా ధర పడిపోవడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో బస్తా పిక్కల ధర 11వేల500 రూపాయల వరకు పలికింది. తర్వాత క్రమంగా 7 వేల వరకు పడిపోవడంతో... నిల్వలు ఉన్న పరిశ్రమలకు నష్టాలు తప్పడం లేదు. ధరలు లేకపోవడం, నష్టాలు పెరుగుతుండటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని దేవరపల్లి, నల్లజర్ల, మోరి, మల్కిపురం ప్రాంతాల్లో పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. వంశపారం పర్యంగా వాటిపైనే ఆధారపడిన వేలాది కార్మిక కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా తయారైంది.

జీడిపప్పు ఉత్పత్తిలో కేరళ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉందంటూ పెట్టుబడుల సదస్సులో పోస్టర్లు వేసుకోవడం తప్ప.. జీడి పిక్కలకు ధరలేక లక్షా 86వేల రైతు కుటుంబాలు నష్టాల్లో మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యాప్‌ ద్వారా రోజువారీ ధరల వివరాలను తెప్పించుకుని, తగ్గిన వెంటనే మార్కెట్‌ జోక్యం ద్వారా ఆదుకుంటామనే హామీని సీఎం గాలికొదిలేశారు. రాష్ట్రంలోని 550కి పైగా జీడి పరిశ్రమలను జులై నెలాఖరు వరకు మూసేయాలని యజమానులు నిర్ణయించినా... కనీసం పిలిచి మాట్లాడే వారే లేకుండా పోయారు.

ABOUT THE AUTHOR

...view details